
మొండి బకాయిలపై చర్యలు
● బంట్వారం పరిధిలో రూ.5.32 కోట్ల పెండింగ్
● సహకార సంఘం జాయింట్ రిజిస్ట్రార్ సూర్యచంద్రరావు
బంట్వారం: దీర్ఘకాలిక రుణాలు చెల్లించని మొండి బకాయిదారులపై చర్యలకు సిద్ధమవుతున్నామని హైదరాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జాయింట్ రిజిస్ట్రార్ (ఓఎస్‌డీ) సూర్యచంద్రరావు అన్నారు. బంట్వారం సహకార సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంఘం పరిధిలో రూ.5.32 కోట్ల రికవరీ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే నోటీసులు జారీ అయిన సుమారు యాభై మంది రైతులను కలిశామని తెలిపారు. వీరిలో ఇద్దరు లోన్ క్లియర్ చేయగా, మిగిలినవారు పంటలు చేతికి వచ్చాక అప్పు చెల్లిస్తామని సమాధానం చెప్పారన్నారు. మరో 300 మంది రైతుల నుంచి ఓవర్‌డ్యూ ఉందన్నారు. వీరందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేసి, రికవరీ చర్యలు చేపడుతామని స్పష్టంచేశారు. నోటీసులు అందుకున్న మొండిబకాయిదారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్టీ రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో రుణాలు చెల్లించకపోతే ఎక్కువ వడ్డీ పడుతుందని తెలిపారు. తీసుకున్న రుణాలను వాయిదాల ప్రకారం చెల్లిస్తే నష్టం ఉండదన్నారు. పెండింగ్ లోన్లను సత్వరమే చెల్లించి సహకార సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అక్షత్, మోమిన్‌పేట బ్రాంచ్ మేనేజర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.