ఎత్తే సవాలైంది! | - | Sakshi
Sakshi News home page

ఎత్తే సవాలైంది!

Sep 8 2025 9:57 AM | Updated on Sep 8 2025 9:57 AM

ఎత్తే సవాలైంది!

ఎత్తే సవాలైంది!

ఈసారి గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం ఆలస్యం

మండపాల నిర్వాహకులకు కృతజ్ఞతలు

సాక్షి, సిటీబ్యూరో: గణేశ్‌ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన శోభాయాత్ర ఆదివారం తెల్లవారుజామున ముగిసినా హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగింది. సోమవారం ఉదయానికి ఇది పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈసారి మండపాల సంఖ్యతోపాటు విగ్రహాల ఎత్తూ గణనీయంగా పెరిగిపోవడంతోనే నిమజ్జన ప్రక్రియలో కొంత జాప్యం జరిగినట్లు నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ప్రకటించారు.

‘ఆఫ్‌లైన్‌’లో రెట్టింపు వరకు..

నగర కమిషనరేట్‌ పరిధిలో గణేశ్‌ మండపాలకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఈ ఏడాది మొత్తం 12,030 విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. అనుమతులు తీసుకోకుండా మరో 40 వేల మండపాలు ఏర్పాటయ్యాయి. క్షేత్రస్థాయి అధికారులు ఆఫ్‌లైన్‌ విధానంలో వాటి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆయా గణపతి విగ్రహాల ఎత్తు, నిమజ్జన ఊరేగింపు మార్గం తదితరాలను గుర్తిస్తూ అది నిమజ్జనం అయ్యే వరకు పర్యవేక్షించారు. దీనికోసం ప్రతి విగ్రహానికి ఓ క్యూఆర్‌ కోడ్‌ కేటాయించారు. ఈ మండపాల నుంచి నిమజ్జనం జరిగే ప్రాంతం వరకు ప్రతి మార్గాన్నీ పర్యవేక్షించిన అధికారులు అడ్డంకులు లేకుండా కృషి చేశారు.

‘లెక్కల్లో’లేని ఆ విగ్రహాలు

నగరంలో ఏర్పాటైన కొన్ని విగ్రహాలతోపాటు పొరుగు కమిషనరేట్లు, జిల్లాల నుంచి వచ్చిన విగ్రహాల ఊరేగింపులతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వీటిలో కొన్ని ఏకంగా 40 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఫలితంగా ఆయా మార్గాల్లో ఉన్న కొన్ని కరెంట్‌ వైర్లు, చెట్లు, కేబుల్‌ తీగలు విగ్రహాలకు అడ్డంకు లుగా మారాయి. మోనప్ప ఐలాండ్‌–రాజ్‌భవన్‌ మార్గంలో శనివారం రాత్రి ఓ విగ్రహం చెట్టు కొమ్మలకు తగిలి వాహనంపైనే వెనక్కు ఒరిగిపోయింది. దీంతో పంజగుట్ట ప్రాంతంలో రిజర్వ్‌లో ఉంచిన క్రేన్‌ను తీసుకువచ్చి విగ్రహానికి ఎలాంటి నష్టం లేకుండా వాహనంపై నిలబెట్టారు. ఇలా మరికొన్ని చోట్లా జరగడంతో ఆయా మార్గాల్లో వాహనాలు ఆగిపోయి శోభాయాత్రకు అవాంత రాలు ఏర్పడ్డాయి.

నెక్లెస్‌రోడ్‌లోకి చేరిన 900 విగ్రహాలు

ఈ ఏడాది మూడోరోజు నుంచి పదకొండో రోజు వరకు దాదాపు 1.4 లక్షల విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో 1.2 లక్షల విగ్రహాలు బేబీ పాండ్స్‌, ఇతర చిన్న చెరువుల్లో నిమజ్జనం కాగా.. మిగిలినవి హుస్సేన్‌సాగర్‌సహా ఇతర చెరువుల్లో జరిగాయి. ఐదడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న 4,700 విగ్రహాలు శనివారం ఉదయం నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యాయి. ఆదివారం మధ్యాహ్నానికి దాదాపు 900 విగ్రహాలతో ఉన్న లారీలు మిగిలిపోవడంతో వీటిని నెక్లెస్‌ రోడ్డులోకి మళ్లించారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా, గార్డెన్‌ పాయింట్‌, జలవిహార్‌, సంజీవయ్య పార్కు వద్ద ఉన్న కొన్ని క్రేన్ల ద్వారా నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు పాక్షికంగా ఎత్తేశారు. సోమవారం తెల్లవారుజాముకు ఈ క్రతువును సంపూర్ణం చేసి, ఆంక్షల్ని ఎత్తేయనున్నారు.

విగ్రహాల ఎత్తు పెరగడమే దీనికి కారణం

గత ఏడాదితో పోలిస్తే తగ్గిన ఉదంతాలు

40 గంటలు అవిశ్రాంతంగా విధులు : సీపీ ఆనంద్‌

ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి సభ్యుల సహకారంతో బడా గణేశుడి నిమజ్జనం గతేడాది కంటే ముందుగా పూర్తయింది. మాకు సహకరించిన ఉత్సవ సమితితోపాటు మండపాల నిర్వాహకులకు కృతజ్ఞతలు. ఊరేగింపుల్లో జరిగిన చిన్నచిన్న ఘర్షణలపై వివిధ ఠాణాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 170 మంది పోకిరీలతోపాటు జేబుదొంగల్ని పట్టుకున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇలాంటి నేరాల సంఖ్య తగ్గింది. సామూహిక నిమజ్జనం కోసం దాదాపు 40 గంటల నిర్విరా మంగా పని చేసిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు.

– సీవీ ఆనంద్‌, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement