
నేడు కలెక్టరేట్‌లో జీపీఓలకు కౌన్సెలింగ్
● జిల్లాలో 236 రెవెన్యూ క్లస్టర్లు
● ప్రస్తుతం 163 క్లస్టర్లకు నియామకం
వికారాబాద్: గ్రామ పాలనాధికారులు త్వరలో విధుల్లో చేరనున్నారు. వారు రెవెన్యూ గ్రామాల బాధ్యతలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గతంలో వీఆర్‌ఓలుగా, వీఆర్‌ఏలుగా విధులు నిర్వహిస్తూ వచ్చిన వీరు గత ప్రభుత్వం వీఆర్‌ఓ వ్యవస్తను రద్దు చేయటంతో ఆయా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్స్‌గా నియమితులైన విషయం విదితమే. ఎన్నికల హామీ మేకు వీఆర్‌ఓ వ్యవస్థను పునరుద్ధరించిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గ్రామపాలనాధికారులుగా నియమించాలని నిర్ణయించింది. ఇందుకు వీరికి పరీక్ష నిర్వహించి అర్హత ఆధారంగా ఎంపిక చేసింది. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా గ్రామపాలనాధికారులు నియామక ప్రతాలు అందుకున్నారు. అనంతరం వారి స్థానికత ఆధారంగా కేటాయించిన జిల్లాలో చేరారు. జిల్లా నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న 139 మంది జీఓపీలుగా రిపోర్టు చేశారు. జిల్లాకు సరిపడా జీపీఓలు లేక పోవడంతో రంగారెడ్డి జిల్లా నుంచి 24 మందిని కేటాయించారు.
పొరుగు నియోజకవర్గాల్లో పోస్టింగ్
అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తీసుకున్న జీపీఓలు వారికి కేటాయించిన జిల్లాలో విధుల్లో చేరారు. ఉన్నతాధికారుల నిబంధనల ప్రకారం వారికి కౌన్సెలింగ్ నిర్వహిచి రెవెన్యూ క్లస్టర్ల వారీగా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా పోస్టింగులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. వీరికి పొరుగు నియోజకవర్గాల్లో పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినా.. ఆరోగ్యం, స్పౌజ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. జీపీఓల నుంచి సైతం ఆప్షన్లు తీసుకునేలా ఫారంలు సిద్ధం చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం ముగిసిన తర్వాత అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) లింగ్యానాయక్ కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం రెవెన్యూ క్లస్టర్లు కేటాయించాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 510 రెవెన్యూ గ్రామాలను 236 రెవెన్యూ క్లస్టర్లుగా విభజించారు. జిల్లాలో ప్రస్తుతం 163 మంది జీపీఓలు మాత్రమే అందుబాటులో ఉండడంతో ముందుగా 163 క్లస్టర్లకు జీపీఓలను కేటాయించి మిగతా క్లస్టర్లను అందుబాటులో ఉన్నవారికి అదనపు బాధ్యతలు ఇచ్చే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక పనులు వేగిరం
జీపీఓల రాకతో రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతానికి ఒక్కో జీపీఓకు మూడు నుంచి నాలుగు రెవెన్యూ గ్రామాలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత తహసీల్దార్ కార్యాలయాల్లో పనిభారం పెరిగింది. ప్రస్తుతం ఒక్కరిద్దరు ఆర్‌ఐలు తహసీల్దార్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారంలో వీరి పాత్ర కీలకం. పై అధికారులకు నివేదించే ప్రతీ ఫైల్‌ను వీరు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి రిపోర్టు సిద్ధం చేయాల్సి ఉంటుంది. గతంలో వీరికి అసిస్టెంట్లుగా వీఆర్వోలు, వీఆర్‌ఏలు విధులు నిర్వహించే వారు. వీరిని తొలగించడంతో పనిభారమంతా ఆర్‌ఐలపైనే పడింది. దీంతో మూడేళ్లుగా ఆర్‌ఐలు సతమతమవుతూ వచ్చారు. ఈ ప్రభావం తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లపైనా పడింది. రేషన్ కార్డులు, కులం, ఆదాయం, నివాసం, లీగలేయర్ తదితర సర్టిఫికెట్ల జారీతో పాటు ఇతర రెవెన్యూ సమస్యలు ఏవైనా ఫీల్డ్ వేరిఫికేషన్ బాధ్యతలు ఆర్‌ఐలపైనే ఉండటంతో పనిభారం పెరిగి రెవెన్యూ సమస్యల పరిష్కారంలో పురోగతి మందగించింది. ప్రస్తుతం జీపీఓల నియామకంతో మళ్లీ వ్యవస్థ గాడిన పడే అవకాశం ఉందని పలువురు చర్చింకుంటున్నారు.