
అలయ్ బలయ్‌కు ఆహ్వానం
అనంతగిరి: హైదరాబాద్‌లో ప్రతీ ఏడాది నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఆదివారం స్పీకర్ నివాసానికి వెళ్లి అక్టోబర్ 3న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న కార్యక్రమ ఆహ్వాన పత్రిక అందజేశారు.
కోట్‌పల్లి ఏఓ కరుణాకర్‌రెడ్డి
బంట్వారం: ఎస్‌ఎంఏఎం (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్) పథకం కింద సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఇవ్వనున్నట్లు కోట్‌పల్లి ఏఓ కరుణాకర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు, మహిళా రైతులకు 50 శాతం మిగిలిన వారికి 40 సబ్సిడీ ఉంటుందన్నారు. ఈ పథకంలో కోట్‌పల్లి మండలానికి 250 బ్యాటరీ స్ప్రేయర్లు , 21 పవర్ ఆపరేటర్ స్ప్రేయర్లు, పది రోటావేటర్లు, కల్టివేటర్లు, డిస్క్‌హరోలు, రెండు సీడ్ ఫెర్టిలైజర్ డ్రిల్, ఒక పవర్ టిల్లర్ కేటాయించారని చెప్పారు. అర్హులై ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తుకు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్ పత్రాలు జతపరిచి రైతు వేదికల్లో అందజేయాలని సూచించారు.
ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్
అనంతగిరి: ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పెన్షన్‌లను పెంచాలని కోరుతూ సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఈ హామీని మెనిఫెస్టోలో పొందుపరిచిందని గుర్తు చేశారు. ఉదయం 11గంటలకు నిర్వహించనున్న ఈ ధర్నాలో పెన్షన్‌దారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
గిరిగేట్‌పల్లిలో మద్యపాన నిషేధం
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్‌పల్లిలో మద్యపాన నిషేదం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం గ్రామస్తులంతా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశంలో గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని చర్చించారు. గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని తెలిపారు. మద్యానికి బానిసై ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని.. అందుకే మద్యపాన నిషేధం అమలుకు నిర్ణయించామని మహిళలు, యువకులు ప్రకటించారు.
ఇబ్రహీంపట్నం రూరల్: నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ అధికారి జయశ్రీ ఆదివారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. ఈనెల 9న (మంగళవారం) ఉదయం 10.30 నుంచి 2.30 గంటల వరకు హైదరాబాద్‌లోని మల్లేపల్లిలోని ఉపాధి కార్యాలయం ఐటీఐ క్యాంపస్‌లో జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లోని రిటైల్, ఈ–కామర్స్, బ్యాంకింగ్, వాయిస్ నాన్ వాయిస్ ప్రాసెస్, నాన్ ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పోస్టులు ఉన్నట్టు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, ఐటీఐ డిప్లమా పూర్తి చేసి ఉండాలన్నారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు. వివరాలకు 90630 99306, 89771 75394 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చేవెళ్ల: ట్రాఫిక్ పోలీసు కేసుల పరిష్కారానికి సోమవారం నుంచి ఈనెల 13వ తేదీవరకు చేవెళ్ల కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎస్.వెంకటేశం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మద్యం తాగి వాహనాలు నడిపించిన కేసులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడిన వారు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి పెండింగ్ కేసులు తక్కువ జరిమానాతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆధార్‌కార్డు, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌లతో రావాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 99632 95757, 94906 17461 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.