
నిబద్ధతతో పనిచేయండి
● సీసీ టీవీల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి ● ఎస్పీ నారాయణరెడ్డి
పరిగి: పోలీసు అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం పరిగి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగించాలని సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ చాలా కీలకమన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలను తక్కువ అంచనా వేయరాదని వాటిపై నిఘా ఉంచాలని తెలిపారు. యువత తప్పుతోవ పట్టించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే ముప్పును ప్రజలకు, యువతకు తెలియజేయాలన్నారు. గంజాయి రవాణ, అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై మోహన్ కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.