
సామాజిక శిక్షణతరగతులకు తరలిరండి
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య
తాండూరు టౌన్: కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈనెల 22, 23, 24వ తేదీల్లో సూర్యాపేటలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సామాజిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య సోమవారం ఓ ప్రకటనలో కోరారు. కుల వివక్ష, అంటరానితనం, ఎస్సీ, ఎస్టీల హక్కుల సాధన వంటి వాటిపై కేవీపీఎస్ నిరంతర పోరాటం చేస్తోందన్నారు. దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించుటలో భాగంగా ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు హాజరు కావాలని సూచించారు.
అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలి
బీవీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింలు
బంట్వారం: అర్హులైన నిరుపేదలందరికీ రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింలు సోమవారం ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ అర్హులైన పేదలకు అన్యాయం జరిగిందన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు తమకు అనుకూలమైన వారికే ఇళ్లు రాశారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగిందన్నారు. అధికారులు సైతం రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. నిజమైన అర్హులను గుర్తించి పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. లేకపోతే బీవీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమానికి సిద్ధమౌతామని హెచ్చరించారు.
సిలిండర్ నుంచి మంటలు
త్రుటిలో తప్పిన ప్రమాదం
బంట్వారం: వంట చేసే సమయంలో ఒక్కసారిగా సిలిండర్ నుంచి మంటలు రావడంతో ఇంట్లో వారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన సోమవారం కోట్‌పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కె.లవకుమార్ కుటుంబ సభ్యులు ఉదయం వేళ వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో బయటికి పరుగులు తీశారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఇంటి యజమాని లవకుమార్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. సిలిండర్‌ను పట్టుకొని ఇంటి బయట వేసి బిందెలతో నీరు పోసినా మంటలు చల్లారలేదు. గ్యాస్ అయిపోయేంత వరకు మంటలు చెలరేగి ఆగిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
‘కళ్లు’ తెరిస్తే మేలు!
బొంరాస్‌పేట: బాల్యంలోని పిల్లలకు అమ్మానాన్నలు చెప్పే రోజువారీ పనులు ఎంతో ప్రభావం చూపుతాయి. మంచి పనులు వారిలో బాధ్యత పెంచడం, సాయం చేయడం, పెద్దలను గౌరవించడం, తోటి వారితో మెలగాల్సిన జీవిత పాఠాలను నేర్పిస్తాయి. కానీ వ్యసనాల బారిన పడిన కొంతమంది పెద్దలు.. చిన్నారులతో కల్లు, మద్యం, సిగరెట్, బీడీ, పొగాకు వంటివి తెప్పించుకోవడం దుష్ప్రభావాలను కలిగిస్తాయి. పిల్లలకు ఏయే పనులు చెప్పాలో.. ఏ పనులు చెప్పకూడదో.. పెద్దలకే తెలియకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని విద్య, మానసికవేత్తలు చెబుతున్నారు.
కారు సీట్లో..వ్యక్తి మృతి
శంషాబాద్ రూరల్: కారు డ్రైవింగ్ సీటులో కూర్చున్న వ్యక్తి కూర్చున్న చోటే మృతి చెందిన సంఘటన తొండుపల్లిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కర్ణాటకకు చెందిన ఏవీ.గణపతి(60), కోమల దంపతులు తొండుపల్లిలో నివాసముంటున్నారు. ఈ నెల 20న మధ్యాహ్నం గణపతి ఇంటి ముందు కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చుని అపస్మారకస్థితిలో చేరుకున్నాడు. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. డోర్లు వేసుకుని కారులో ఎక్కువ సమయం కూర్చోవడంతో ఊపిరి ఆడక లేదా గుండెపోటుతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సామాజిక శిక్షణతరగతులకు తరలిరండి