
పోలీసుల అదుపులో దొంగ
ధారూరు: గ్రామ దేవతల ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను పట్టుకున్న స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండల పరిధిలోని రుద్రారం– తిమ్మానగర్ గ్రామాల మధ్య సోమవారం చోటుచేసుకుంది. రుద్రారంవాసులు, ఎస్‌ఐ రాఘవేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రుద్రారం శివారులోని బోనమైసమ్మ గుడిలో ఉదయాన్నే ఓ వ్యక్తి ప్రవేశించడాన్ని అక్కడి రైతులు గమనించారు. తాళం వేసి ఉన్న ఆలయంలోకి ఎలా వెళ్లాడనే అనుమానం రావడంతో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే తాళం ధ్వంసం చేసిన సదరు వ్యక్తి అమ్మవారి వెండి కళ్లను దొంగిలించాడు. అతన్ని పట్టుకుని ప్రశ్నించగా మరాఠీ, హిందీ మాట్లాడటంతో గ్రామంలోకి తీసుకువెళ్లారు. అతని సంచిలో సోదా చేయగా అమ్మవారి వెండి విగ్రహాలు, కళ్లు, చేతులు, ఓ తాబేలు, బురకపిట్టలు కనిపించాయి. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ రాఘవేందర్, సిబ్బందితో వెళ్లి అతన్ని స్టేషన్‌కు తరలించారు. విచారించగా తన పేరు రోహిత్, మహారాష్ట్ర అని మాత్రమే చెప్పాడు. అతని వద్ద వెండి వస్తువులు లభ్యంకావడంతో పూర్తి స్థాయిలో విచారించి, కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తామని ఎస్‌ఐ తెలిపారు.
ఆలయంలో చోరీ చేస్తుండగా పట్టుకున్న స్థానికులు
వెండి వస్తువులు, విగ్రహాలు లభ్యం