
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అనంతగిరి: భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరే ట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా ఆస్తి నష్టం, రోడ్లు దెబ్బతిన్నా, ఇతర సహాయం కోసం కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. 08416 242136, 79950 61192 ఫోన్ నంబర్లలో అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
నేడు పరిగికి మంత్రి శ్రీధర్‌బాబు రాక
పరిగి: మండలంలోని తుంకుల్‌గడ్డకు గురువారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రానున్నట్లు ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3గంటలకు తుంకుల్‌గడ్డలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం దోమ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్య క్రమం ఉంటుందన్నారు.
దోమ మండలానికి..
దోమ: మండల కేంద్రానికి గురువారం మంత్రి శ్రీధర్‌బాబు రానున్నట్లు తహసీల్దార్ గోవిందమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోత్కూర్ గ్రామ పరిధిలోని చెంచుకాలనీలో రూ.40 లక్షలతో ట్రైబల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, మహిళా సంఘాల సభ్యులకు రుణ చెక్కులు అందజేస్తారన్నారు.
సీఎంను కలిసిన
దౌల్తాబాద్ నాయకులు
దౌల్తాబాద్: కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బుధవారం నగరంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. కొడంగల్ కడా కార్యాలయంలో సమస్యలపై వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తారని సీఎం హామీ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రావు, వెంకట్‌రెడ్డి, ప్రమోద్‌రావు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
పదోన్నతులు కల్పించాలి
రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్
దౌల్తాబాద్: ఉపాధ్యాయులకు బదిలీలతో కూడిన పదోన్నతులు కల్పించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మండలంలోని టీఎస్ ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లుల కోసం చాలా మంది ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. హెల్త్‌కార్డులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. సీసీఎస్ రద్దు చేయాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఇచ్చే కరువు భత్యం మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక కార్యవర్గ సభ్యుడు పవన్‌కుమార్, ఉపాధ్యక్షులు ఊషన్న, రమేష్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
పూడూరు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూటీఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు డిమాండ్ చేశారు. బుధవారం ఈ మేరకు తహసీల్దార్ భరత్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరారు. బదిలీలు, పదోన్నతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మోహిజ్‌ఖాన్, మండల అధ్యక్ష, కార్యదర్శులు మహిపాల్, వెన్నెల సత్యం, సమద్ తదితరులు పాల్గొన్నారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కంట్రోల్ రూమ్ ఏర్పాటు