
గోడకు కన్నం వేసి.. మద్యం చోరీ
యాలాల: మండల కేంద్రంలోని యాలాల వైన్స్‌లో చోరీ జరిగిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, షాపు నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న యాలాల వైన్స్‌ను ఎప్పటిలాగే గురువారం ఉదయం 10 గంటలకు తెరిచారు. షాపు లోపల గోడకు రంధ్రాన్ని గుర్తించిన నిర్వాహకులు చోరీ జరిగినట్లు గ్రహించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవారం అర్ధరాత్రి వేళ షాపు వెనుక భాగంలో గోడకు రంధ్రం చేసిన దొంగ అక్కడి నుంచి లోపలికి వచ్చాడు. గల్లాపెట్టెలో ఉన్న సుమారు రూ.40వేల నగదుతో పాటు 4 ఫుల్ బాటిళ్లను తస్కరించాడు. తాను చోరీకి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో ఉంటాయనే భావనతో అక్కడే ఉన్న హార్డ్ డిస్క్‌ను సైతం ఎత్తుకెళ్లాడు. ఎస్‌ఐ విఠల్ తన సిబ్బందితో షాపు పరిసరాలను పరిశీలించారు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
రూ.40 వేల నగదు,
నాలుగు ఫుల్ బాటిళ్ల తస్కరణ