
ఉద్యానానికి ఊతం..
● జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు
● 80 నుంచి 100 శాతం రాయితీతో స్ప్రింకర్లు, డ్రిప్ పరికరాలు
● 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ
● పండ్లు, పూల తోటలు, కూరగాయల సాగుకు వర్తించేలా..
● అవగాహన కల్పిస్తున్న అధికారులు
వికారాబాద్: ఉద్యానవన పంటలకు ఊతమిచ్చేదిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉన్న వికారాబాద్ జిల్లాలో ఈ తరహా పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు అధికారులు రైతులను సమాయత్తం చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ వాసుల కూరగాయల అవసరాలు నగర చుట్టుపక్కల జిల్లాల రైతులు 50శాతం కూడా తీర్చలేకపోతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, మొదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి 50 శాతంలోపే నగరానికి వస్తున్నట్లు సమాచారం. మిగిలిన అవసరాలను పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పూర్తిస్థాయిలో నగర అవసరాలను తీర్చేలా జిల్లా రైతులను ప్రోత్సహించడం ద్వారా మన ఆదాయం కూడా గణనీయంగా పెంచుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా ఉద్యానవన శాఖ కసరత్తు చేస్తోంది.
సాగు విస్తీర్ణం రెండింతలయ్యేలా..
నగర సమీప జిల్లాలతో పోలిస్తే కూరగాయల సాగుకు అనువైన.. సారవంతమైన భూములు మన జిల్లాలోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఉద్యాన వన పంటల సాగును ఏటేటా పెంచుతూ సమీప భవిషత్తులో రెండింతలు సాగయ్యేలా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను రైతులకు వివరిస్తున్నారు. సాగుకు వినియోగించే యంత్ర పరికరాలను 80 నుంచి 100 శాతం రాయితీపై అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా 2025 – 26 ఆర్థిక సంవత్సరానికిగాను రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు.
ఉద్యాన సాగుపై మక్కువ
జిల్లా రైతులు దశాబ్ద కాలంగా ఉద్యానవన పంటల సాగుపై మొగ్గు చూపుతున్నారు. కూరగాయలు, పూలు, పండ్ల తోటలను ఎక్కువగా పెంచుతున్నారు. సుగంధ ద్రవ్యాల సాగు చాలా వరకు తగ్గిపోయింది. జిల్లాలో ప్రస్తుతం 49,495 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతుండగా ఇందులో 15,265 ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నాయి. 27,125 ఎకరాల్లో కూరగాయలు సాగుచేస్తున్నారు. సుగంధ ద్రవ్య పంటలైన పసుపు, అల్లం 6,254 ఎకరాల్లో సాగవుతున్నాయి. 851 ఎకరాల్లో పూలతోటలు సాగుచేస్తున్నారు.
రాయితీతో పరికరాలు
ఉద్యాన సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 80 శాతం నుంచి 100 శాతం రాయితీతో స్ప్రింకర్లు, డ్రిప్ పరికరాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాదికి గాను 525 ఎకరాలకు డ్రిప్ పరికరాలు, 500 ఎకరాలకు స్ప్రింక్లర్లను ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీపై, బీసీ, ఓసీ, సన్న చిన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై ఇవ్వనున్నారు. ఓసీ, బీసీ, పెద్ద రైతులకు 80 శాతం రాయితీపై ఈ పరికరాలు ఇస్తారు. ఒక్కో రైతుకు గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రాయితీ వర్తించనుంది.
జిల్లాలో పండ్ల తోటల సాగు 15,265 ఎకరాల్లో
కూరగాయలు 27,125 ఎకరాల్లో
సుగంధ ద్రవ్యాలు 6,254 ఎకరాల్లో
పూలతోటలు 851 ఎకరాల్లో
దరఖాస్తు చేసుకోవాలి
ఉద్యాన పంటల సాగుకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. ఈ ఏడాదికి గాను బడ్జెట్ కేటాయించింది. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలి. నియెజకవర్గ స్థాయిలోని ఉద్యానవన శాఖ అధికారుల వద్ద దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. పట్టదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేయాలి.
– సర్దార్, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి

ఉద్యానానికి ఊతం..