
సెలవు రోజున ఇసుక అనుమతులా?
యాలాల: కాగ్నా నది నుంచి ఇసుక తరలింపు కోసం రెవెన్యూ అధికారులు జారీ చేసిన అనుమతులపై యాలాల, విశ్వనాథ్‌పూర్ రైతులు మండిపడ్డారు. సోమవారం బోనాల సందర్భంగా సాధారణ సెలవు ఉండగా, పలు ట్రాక్టర్లు, టిప్పర్లు కాగ్నా వద్దకు చేరుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఇరు గ్రామాల రైతులు నదిలోకి వెళ్లే ప్రాంతంలో రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ పనులు, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇవ్వడాన్ని తాము తప్పు పట్టడం లేదని, సెలవు రోజున పర్మిషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా చేపడుతున్న ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తరలింపునకు మరో చోట రీచ్ గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, రైతులతో కలిసి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు బాలేసాబ్, సత్యమ్మ, సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, రైతులు జీవీరెడ్డి, మాధవరెడ్డి, నాగయ్య, అశోక్, నర్సింహులు, భాస్కరచారి, మలిగేరి నర్సింహులు తదితరులు ఉన్నారు.
రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడ్డ రైతులు
రోడ్డుపై బైఠాయించి నిరసన