బస్సులు లేక విద్యార్థుల గోస | - | Sakshi
Sakshi News home page

బస్సులు లేక విద్యార్థుల గోస

Jul 20 2025 2:25 PM | Updated on Jul 21 2025 5:07 AM

బస్సు

బస్సులు లేక విద్యార్థుల గోస

● పట్టించుకోని ఆర్టీసీ అధికారులు ● పాఠశాలకు ఆలస్యంగా వెళ్తున్న విద్యార్థులు

కొడంగల్‌: బస్సు లేదు.. చదువు రాదు అన్న చందంగా మారింది గ్రామీణ ప్రాంత విద్యార్థుల పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఆర్టీసీ అధికారుల తీరు ఇలా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల నుంచి చదువుకోడానికి కొడంగల్‌కు వచ్చే విద్యార్థులు ప్రతి రోజూ గంటకు పైగా ఆలస్యంగా వస్తున్నారని ఎంఈఓ రాంరెడ్డి తెలిపారు. సమయానికి విద్యార్థులు పాఠశాలకు రాకపోవడం వల్ల ఉదయం పూట టిఫిన్‌ తినలేకపోతున్నారని అన్నారు. పాఠశాల సమయానికి విద్యార్థుల కోసం బస్సులు నడపాలని పలుమార్లు ఆర్టీసీ డిపో మేనేజర్లను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. మండల పరిధిలో ఐదువేలకు పైగా జనాభా ఉన్న రుద్రారం గ్రామానికి సైతం పాఠశాల సమయంలో బస్సులు లేవని తెలిపారు. విద్యార్థులు కొడంగల్‌కు వచ్చి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రుద్రారంతో పాటు నీటూరు, అప్పాయిపల్లి గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం లేదన్నారు. ఆయా గ్రామాలకు ఉదయం 8.45 నిమిషాలకు, సాయంత్రం 4.40 నిమిషాలకు బస్సులు నడిపించాలని తాండూరు, పరిగి డిపో మేనేజర్లను పలుమార్లు కోరినట్లు తెలిపారు. పాఠశాల సమయానికి ఉదయం ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు నడిపిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. కొడంగల్‌ నుంచి రుద్రారం వెళ్లే మార్గంలో చిట్లపల్లి, సంగాయిపల్లి, అంగడిరాయిచూర్‌, లక్ష్మీపల్లి,టేకుల్‌కోడ్‌, అన్నారం,నాగారం గ్రామాలు ఉన్నాయి. ఈ మార్గంలో బస్సు నడ ప డం ద్వారా ధర్మాపూర్‌, పాటిమీదిపల్లి గ్రామాల వి ద్యార్థులకు, ప్రజలకు కూడా మేలు కలుగుతుంది.

ఆర్టీసీ కంట్రోలర్ల ఇష్టారాజ్యం:

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌

తాండూరు టౌన్‌: తాండూరు ఆర్టీసీ డిపోలో కంట్రోలర్లు రఘుపతి, శంకర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆరోపించారు. విద్యార్థులు స్కూల్‌కు వెళ్లే సమయంలో బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధికంగా ఆదాయం వచ్చే రూట్లలోనే ఎక్కువగా బస్సులు నడుపుతూ కంట్రోలర్లు విద్యార్థులు, మహిళలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారని ఆరోపించారు. అధికారుల తీరును వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం డిపో ఎదుట నిరశనకు దిగారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఉదయం, సాయంత్రం విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వచ్చే సమయాల్లో కాకుండా ముందు లేదా ఆలస్యంగా బస్సులు నడుపుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ప్రభుత్వం అందుకు తగిన విధంగా బస్సు సర్వీసులను పెంచలేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల మీద టార్గెట్లు పెట్టి అధికారులు వారిని తీవ్ర మానసిక వ్యథకు గురి చేస్తున్నారన్నారు. ఇద్దరు కంట్రోలర్లు ట్రాన్స్‌ఫర్‌ అయినప్పటికీ రిలీవ్‌ కాకుండా ఇక్కడే తిష్ట వేశారన్నారు. ఇప్పటికై నా డిపో మేనేజర్‌ స్పందించి విద్యార్థుల సమయానికి అనుకూలంగా బస్సులు నడపాలని, వెంటనే మరిన్ని బస్సు సర్వీసులను పెంచాలని, బస్టాండ్‌లో సౌకర్యాలను మెరుగు పరచాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. నిరశన కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు చంద్రయ్య, బాలప్ప, రఘుపతి, ప్రయాణికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

బస్సులు లేక విద్యార్థుల గోస 1
1/1

బస్సులు లేక విద్యార్థుల గోస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement