
వైభవంగా పవిత్రోత్సవాలు
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్‌లో వెలిసిన పద్మావతి సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ నుంచి వచ్చిన అర్చకులు మొదటి రోజు ఆదివారం ఉదయం వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా యాగశాలలో శత కలశ తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనే, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు యాగశాలలలో విశేష హోమాలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. వేంకటేశ్వర స్వామి వారిని పవిత్ర మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రత్యేక పూజలు జరిపించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న వారు ఓం నమో వేంకటేశాయ నమః అంటూ పరవశించి పోయారు. గోవింద నామస్మరణతో యాగశాల మార్మోగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
అష్ట దళ పాద పద్మారాధన సేవ
పేదల తిరుపతిగా పేరుగాంచిన పద్మావతి సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో టీటీడీ నుంచి వచ్చిన అర్చకులు ఆదివారం ఉదయం స్వామివారి పాదాల దగ్గర అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించారు. 108 వెండి పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన పఠిస్తూ పూజలు చేశారు.
శ్రీవారికి అష్ట దళ పాద పద్మారాధన సేవ యాగశాలలో శత కలశ తిరుమంజనం

వైభవంగా పవిత్రోత్సవాలు