
‘పరిషత్’కు బీజేపీ కసరత్తు
పర్యాటకుల సందడి కోట్‌పల్లి ప్రాజెక్టుకు ఆదివారం పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రాజెకు నీటిలో సేదతీరారు.
9లోu
తాండూరు: పరిషత్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకే పరిమితమవగా ఈ దఫా స్థానిక పోరులో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ నేతలు ఆశావహుల పేర్లను పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున బీజేపీ అధిష్టాన నేతలు జిల్లా స్థాయిలో పార్టీ శ్రేణులతో కార్యశాల పేరిట క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమైంది.
పార్టీ బలోపేతమే ప్రధాన ఎజెండా
జిల్లాలోని 20 మండలాల జెడ్పీటీసీ స్థానాలకు, 227 ఎంపీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. బీజేపీ సైతం జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలిపేందుకు ప్రయత్నిస్తోంది. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఈ ఎన్నికలను అనుకూలంగా మార్చుకునేందుకు నేతలు యోచిస్తున్నారు. పార్టీ పటిష్టతకు అంకితభావంతో పనిచేయడంతో పాటు ప్రజాబలం కలిగిన వారికే టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నేతలు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
నేటి నుంచి కార్యశాల
జిల్లాలోని అన్ని మండలాల్లో జెడ్పీటీసీ, మండల స్థాయి వర్క్ షాప్ పేరిట ఈ నెల 21వ తేదీ నుంచి 23 వరకు మండల స్థాయిలో పార్టీ శ్రేణులతో కార్యశాల నిర్వహించనున్నారు. 25, 26 తేదీల్లో మహా సంపర్క్ అభియాన్ పేరిట ఇంటింటికి స్టిక్కర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అనంతరం బూత్ కమిటీల ఆధ్వర్యంలో శ్రేణులు, అభిమానులతో పోలింగ్ బైటక్ కార్యక్రమం, 27వ తేదీ నుంచి 30 వరకు మండల స్థాయి ర్యాలీలు, ఆగస్టు 1, 2వ తేదీల్లో జిల్లా స్థాయి ర్యాలీ నిర్వహించేందుకు కార్యచరణ సిద్ధంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేసేందుకు అవసరమైతే ఇతర పార్టీల్లో ప్రజాబలం ఉన్న నాయకులకు కాషాయ కండువా కప్పేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఇందుకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల పేరిట జిల్లా నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
ఖాతా తెరిచేందుకు..
జిల్లాలో ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేసిన దాఖలాలు లేవు. ఈ దఫా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖతా తెరవాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. మండల స్థాయిలో బలమైన కేడర్ లేకపోవడం. ఉన్న కొందరు నాయకులు సైతం ఖర్చుకు భయపడి పోటీకి దూరంగా ఉంటున్నారనే చర్చలు ఉన్నాయి. చేవెళ్ల ఎంపీగా విశ్వేశ్వర్‌రెడ్డి విజయం సాధించడంతో పార్టీకి బలం పెరిగిందనే వాదన పలువురు నాయకుల్లో వినిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడితే రాజకీయ పరిణామాలు బీజేపీకి అనుకూలిస్తాయా.. ప్రతికూలంగా మారుతాయా అనేది స్పష్టత రానుంది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు కార్యాచరణ
అభ్యర్థుల వేటలో కమలనాథులు
ఇతర పార్టీల్లో అసంతృప్తులకు టికెట్ ఆఫర్లు