
కలిసిరాని కాలం..
కాలం కలిసి రాక అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీజన్ ప్రారంభమైనా సరైన వానలు కురవకపోవడంతో రైతన్నలు దిగాలుగా ఆకాశం వైపు చూడసాగారు. జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటల సాగుకు అంతరాయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దౌల్తాబాద్: వానాకాలం సాగును వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కురిసిన మోస్తరు వర్షంతో అన్నదాతల ఆశలు చిగురించాయి. మండల వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో అత్యధికంగా కురవగా కొన్నింటిలో తక్కువ వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అన్ని గ్రామాల్లో అనుకున్న మేర వానలు కురవలేదు. అడపాదడపా కురుస్తున్న జల్లులకు పత్తి పంటకు జీవం పోస్తున్నాయి. కానీ నారుమడులు పోసిన రైతులు చెరువులు నిండకపోవడంతో సాగు ప్రశ్నార్థకమవుతోందని ఆందోళన చెందుతున్నారు. కరెంటు బావుల వద్ద ఉన్న ప్రాంతాల్లో మాత్రం నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. నారుమళ్లలో నారు పోసి సుమారు 15 నుంచి 20 రోజులు కావస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది రైతులకు సబ్సిడీ ద్వారా జీలుగ, జనుము విత్తనాలను సరఫరా చేశారు. భారీ వర్షాలు కురిస్తే పంటలు సాగయ్యే అవకాశముందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. మండలంలో జూన్ నెలలో 114.2 సాధారణ వర్షపాతంకుగాను 83.6, జూలై నెలలో 184.3కిగాను 60.9 వర్షపాతం నమోదైంది.
సరిపడా వర్షాలు లేక
ఆందోళనలో కర్షకులు
గణనీయంగా తగ్గిన వర్షపాతం
పంటలు ఎండిపోతున్నాయని గగ్గోలు
మబ్బులు చూస్తున్నాం
నారుమడులు ఎండిపోతున్నాయి. వర్షాలు ఆశించినస్థాయిలో కురవక ఆందోళన చెందుతున్నా. కరిగెట చేసి 10 రోజులవుతుంది. నారుమడులు వచ్చాయి. నాటు వేసే దశకు వచ్చినా మబ్బులు చూడాల్సిన దుస్థితి దాపురించింది.
– జనార్దన్‌రెడ్డి, రైతు, నందారం