
మహిళలకు అండగా భరోసా కేంద్రం
● ఎస్పీ నారాయణరెడ్డి ● బాధితులకు మరింత మెరుగైన సేవలందించాలని సూచన
అనంతగిరి: మహిళలకు అండగా జిల్లా భరోసా కేంద్రం పని చేస్తోందని ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పోలీస్ కేంద్రంలోని భరోసా కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం అందిస్తున్న సేవలను కొనియాడారు. బాధితులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కేంద్రం మహిళలు, పిల్లలకు అండగా నిలుస్తోందన్నారు. గృహ హింస, లైంగిక వేధింపులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి అన్ని విధాలా సహాయం అందిస్తోందని తెలిపారు. బాధితులకు న్యాయం అందించడంలోనూ, వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వడంలోనూ ఇక్కడి సిబ్బంది పాత్ర అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు హనుమంత్ రావు, మురళీధర్, డీఎస్పీలు, భరోసా కేంద్రం సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం వికారాబాద్‌లోని తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసులు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలన్నారు. తద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందని, న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ టీవీల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. నిరంతరం వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు మురళీధర్, టీవీ హనుమంత్‌రావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.