
పర్యావరణాన్ని కాపాడుకుందాం
● జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ నాయక్ ● విద్యార్థులకు ఉపన్యాస పోటీలు
తాండూరు టౌన్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మేరా యువ భారత్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు చెట్లు మానవాళికి ఎలా ఉపయోగపడతాయి అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. అనంతరం శంకర్ నాయక్ మాట్లాడుతూ.. పలు కాలుష్య కారకాల వల్ల పర్యావరణం కలుషితమవుతోందన్నారు. భూగోళంపై ఆక్సిజన్ శాతం పెరగాలంటే చెట్లు విపరీతంగా విస్తరించాలన్నారు. ఇందుకు విధిగా ప్రతి ఒక్కరూ ఏక్ పేడ్ మాకే నామ్ పర్ అనే నినాదంతో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. భవిష్యత్‌లో కాలుష్య వాతావరణాన్ని తగ్గించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం ఉపన్యాస పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మెమొంటో తోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధికారి అంజయ్య, అధ్యాపకులు వెంకటస్వామి, విద్యా సాగర్, వెంకన్న, జి వెంకటస్వామి, గోవర్ధన్, రమ తదితరులు పాల్గొన్నారు.