
సస్యరక్షణే ముఖ్యం
కందుకూరు: పండ్ల తోటల్లో మామిడి తర్వాత అధికంగా సాగు చేసేది జామ పంట. నికరాదాయంతో పాటు ఏడాదికి రెండుసార్లు దిగుబడి వస్తుండటంతో రైతులు జామ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో దాదాపు 15,800 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం జామ సాగులో ఉంది. కాకపోతే విదేశాల నుంచి తెచ్చిన తైవాన్ రకం జామ ద్వారా దేశంలోకి నులి పురుగుల బెడద తీవ్రతరం అయింది. దీంతో తైవాన్ రకంతో పాటు దేశీయ రకాలైన అలహాబాద్ సఫేదీ, లక్నో–49 తదితర రకాలకు నులి పురుగులు ఆశించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నులి పురుగులు వేర్లను ఆశించడంతో చెట్టు ఎండిపోయి చనిపోతుంది. లక్షణాలు గుర్తించక నీళ్లు పెట్టడం, అధికంగా ఎరువులు వేయడంతో ఉపయోగం ఉండటంలేదని కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ తెలిపారు. నులి పురుగుల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను గురించి ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు.
లక్షణాలు
● ఆకులు పసుపు రంగులోకి మారడం.
● కొమ్మలు, లేత చిగుర్లు వడలిపోవడం, నులి పురుగులు ఆశించిన తొలి దశలో భూమిలో తగినంత తేమ ఉన్నా మొక్కలు వాడిపోయి కన్పిస్తాయి.
● చెట్టు ఎదుగుదల లోపించడం, చెట్టు మోడు భారడం.
● పూత, పిందె రాలడం లేదా ఆలస్యం అవడం, వచ్చినా త్వరగా రాలిపోవడం.
● నీరు, ఎరువులు అందించినా మొక్క కోలుకోకపోవడం.
● ఈ లక్షణాలు అన్నీ ఎండు తెగులు లక్షణాలు పోలి ఉండటం.
● వేర్లు ముడులు ముడులుగా మారి, బుడిపెలని కలిగి ఉండటం, వేరు వ్యవస్థ క్షీణించి ఉండటం.
● నులి పురుగులు సోకిన వేరు భాగాల్లో ఎండు తెగులు శిలీంధ్రం ఆశించి వేరు కుళ్లి పోవడం.
పంట నష్టం
ఈ నులి పురుగులతో ఒక సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల వరకు జామ తోటల్లో 60–100 శాతం, నర్సరీల్లోనైతే 90–100 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది.
వ్యాప్తి నివారణ చర్యలు
● నులి పురుగులు లేనివిగా నిర్ధారించబడిన నర్సరీల నుంచి మాత్రమే ఆరోగ్యవంతమైన జామ అంట్లను కొనుగోలు చేయాలి.
● జామ అంట్లు కట్టడానికి, నర్సరీల్లో అంటు మొక్కలను పెంచడానికి నులిపురుగులు లేని స్వచ్ఛమైన మట్టిని వాడుకోవాలి.
● ఆకులు పచ్చబారి, వాడిపోయి వేరుపై బొడిపెలు లాంటివి కలిగి ఉన్న మొక్కలను తోటలో నాటరాదు.
నర్సరీలో యాజమాన్య పద్ధతులు
● ఒక టన్ను మట్టిలో 50–100 కిలోల వేప చెక్క పిండి లేదా గానుగ పిండి, జీవ నియంత్రణ కారకాలైన పర్పురియోసిల్లమ్ లిలాసినస్, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, ట్రై కోడెర్మా హార్జియానమ్ ఒక్కో కిలో చొప్పున కలిపిన మట్టిని అంట్లు కట్టే ముందు సంచుల్లో నింపాలి.
● కార్బోఫ్యూరాన్ 3జీ లేదా ఫోరేట్ 10జీ 5 కిలోలను ఒక టన్ను మట్టికి కలపాలి.
● నారు మడులను, నారు మొక్కలను పెంచడానికి వాడే మట్టిని వేసవి కాలంలో తెల్లపాలిథీన్ షీటుతో (45–60 రోజులు) కప్పి ఉంచి సోలరైజేషన్ ప్రక్రియ ద్వారా నులి పురుగులను నివారించవచ్చు.
● డయాజోమెట్ గుళికలు ఎకరాకు 60 కిలోల చొప్పున వేసి కలియబెట్టి పాలిథీన్ షీటుతో కప్పి, ఒక వారం ఉంచి తర్వాత షీటును తీసి, మట్టిని తిరిగి కలియబెట్టి 2–3 రోజుల తర్వాత మొక్కలను నాటుకోవాలి. ఈ పద్ధతితో నులిపురుగులను త్వరితగతిలో నివారించవచ్చు.
తోటల్లో యాజమాన్యం
● వేసవిలో లోతుగా దక్కులు దున్ని మట్టిని కలియబెట్టాలి.
● కొత్తగా జామ తోటలు వేసే ముందు మట్టిని నులిపురుగులకై పరీక్ష చేయించుకోవాలి.
● నులిపురుగులు ఉన్న భూమిలో మొక్కలు నాటే ముందు జీవనియంత్రణ కారకాలతో సమృద్ధి చేయబడిన వానపాముల ఎరువు లేదా వేప పిండి గుంటకి 5 కిలోల చొప్పున వేసుకుని అంట్లని నాటాలి.
● ఒక టన్ను వానపాముల ఎరువు లేదా పశువుల ఎరువు లేదా వేప పిండిలో 5 కిలోల చొప్పున పర్పూరియోసిల్లమ్ సిలాసినమ్, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, ట్రై కోడెర్మా హార్జినియమ్ కలిపి 30 రోజులు ఉంచి సమృద్ధి చేసిన మిశ్రమాన్ని 3–4 కిలోలు ఒక చెట్టుకు 6 నెలల వ్యవధిలో వేయాలి.
● పైన సూచించిన జీవ నియంత్రణ కారకాలతో ఉన్న వేప పిండి లేదా పశువుల ఎరువును 20 కిలోలను 200 లీటర్ల నీటిలో 2 రోజుల పాటు నానబెట్టి 2–3 లీటర్లతో ఒక్కో చెట్టు పొదళ్లు తడిపి నులి పురుగులను నివారించవచ్చు.
జామ పంటలో నులిపురుగుల బెడద
ముందస్తు చర్యలతో కట్టడి చేయవచ్చు
కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు శ్రీకృష్ణ

సస్యరక్షణే ముఖ్యం

సస్యరక్షణే ముఖ్యం