
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
దుద్యాల్: తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని హస్నాబాద్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, కొడంగల్ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన చాకలి వెంకటమ్మ, ఇస్వప్పకు ముగ్గురు కుమారులు. వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రులకు పెద్ద కుమారుడు నవీన్(24) చేదోడువాదోడుగా ఉండేవాడు. ఇటీవల తన బైక్‌పై గుజరాత్, ఆరుణాచలంతో పాటు ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లి వచ్చాడు. ఈ విషయమై తల్లిదండ్రులు అతన్ని మందలించారు. బైక్‌పై వందల కిలోమీటర్ల ప్రయాణం సురక్షితం కాదని, ప్రమాదాలు జరిగే అవకాశంతో పాటు ఆరోగ్యం పాడవుతుందని చెప్పారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల పేరుతో మరోసారి బైక్‌పై వెళ్లొద్దని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ సోమవారం ఉదయం పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. చేతికి వచ్చిన చెట్టంత కొడుకు ఇలా చేస్తాడని ఊహించలేదని బాధిత తల్లిదండ్రులు రోదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం హస్నాబాద్‌లో విషాదం