
ఏఐకి సై
● ప్రాథమిక పాఠశాల నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యకు కసరత్తు ● కొడంగల్ నియోజకవర్గంలోని 112 స్కూళ్లకు 265 కంప్యూటర్ల పంపిణీ ● సీఎం ఇలాకాలో విద్యకు ప్రాధాన్యత
కొడంగల్: నియోజకవర్గంలో ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యకు అడుగులు పడుతున్నాయి. కొడంగల్, దుద్యాల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లోని 112 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ బోధనకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా 265 కంప్యూటర్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. 30 మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలలో ఏఐ బోధన ప్రారంభించనున్నట్లు ఎంఈఓ రాంరెడ్డి తెలిపారు. గతంలో ఉన్నత పాఠశాలల్లో ఈ తరహా బోధన అమలు చేశామని తెలిపారు. ఒక్కో స్కూల్‌కి ఐదు చొప్పున కంప్యూటర్లు అందజేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లు వచ్చాయన్నారు. వీటిని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా ఆయా పాఠశాలలకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో కంప్యూటర్ పరిజ్ఞానం అందించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యా రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
పేదలకు చేరువలో విద్య, వైద్యం
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విద్య, వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, పారా మెడికల్ కళాశాల, స్కిల్ యూనివర్సిటీ, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, వెటర్నరీ కాలేజీ, కొత్త మండలమైన దుద్యాల్ తోపాటు దౌల్తాబాద్, బొంరాస్‌పేట్‌కు జూనియర్ కళాశాలలను మంజూరు చేశారు. కొడంగల్ ప్రభుత్వాస్పత్రిని విస్తరించి 220 బెడ్ల సామర్థ్యం కలిగిన టీచింగ్ హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ, మైనార్టీ వెల్ఫేర్, బీసీ సంక్షేమ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలకు అధునాతన వసతులతో కొత్త భవనాలు మంజూరు చేశారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేశారు.
ఉన్నతమైన ఆశయానికి అండగా..
పేద విద్యార్థులకు ఉదయం పూట బలవర్ధకమైన అల్ఫాహారం అందించాలనే ఉన్నతమైన ఆశయం వెనుక ఐదుగురి కృషి ఉంది. అందులో మొదటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. సీఎం చొరవతోనే ఈ పథకానికి రూపకల్పన చేశారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, వయాట్రీస్ సంస్థ సీఎస్‌ఆర్ నిధుల ఇండియా హెడ్ మిచెల్ డొమినికా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్, తెలంగాణ సోషల్ ఇంఫాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ సహకారం ఉంది. పట్టణంలోని మార్కెట్ యార్డులో నిర్మించిన కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్‌లో ఆహారాన్ని వండేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. వంట కోసం ఉపయోగించే నీటిని ఆర్‌ఓ ప్లాంట్‌లో శుద్ధి చేస్తారు. బాయిలర్ ప్లాంట్, గ్యాస్ బ్యాంక్, ఎప్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వండిన ఆహారం వేడిగా, పరిశుభ్రంగా ఉండడానికి తగిన చర్యలు తీసుకున్నారు.
బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇలా..
సోమవారం – ఇడ్లీ, సాంబారు
మంగళవారం – పూరీ, ఆలూ కుర్మా
బుధవారం – ఉప్మా, సాంబార్
గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్
శుక్రవారం – ఉగ్గాని / పొంగల్, చట్నీ
శనివారం – బోండా, చట్నీ
28వేల మందికి అల్పాహారం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 28వేల మంది విద్యార్థులకు రోజూ ఉదయం పూట అల్పాహారం అందిస్తున్నారు. ఈ బాధ్యతను హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తీసుకుంది. ఇందుకోసం కొడంగల్ పట్టణంలో కేంద్రీ కృత కమ్యూనిటీ కిచెన్ షెడ్‌ను నిర్మించారు. నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ హెల్తీ న్యూట్రీషన్ బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నారు. సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ) నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఏఐకి సై