కాసుల కక్కుర్తి | - | Sakshi
Sakshi News home page

కాసుల కక్కుర్తి

Jul 12 2025 6:58 AM | Updated on Jul 12 2025 7:21 AM

కాసుల కక్కుర్తి

కాసుల కక్కుర్తి

● చికిత్సల పేరుతో ఘరానా మోసం

● నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వహణ

● పట్టించుకోని వైద్యాధికారులు

పరిగి: ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకూ హెచ్చుమీరుతున్నాయి. శస్త్ర చికిత్సల పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అబార్షన్లు(గర్భస్రావం) సైతం చేస్తున్నారు. వైద్యం ముసుగులో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాఫియా జరుగుతుంది. ఇందుకు నిదర్శనమే ఇటీవల పరిగి పట్టణ కేంద్రంలోని విజేత ఆస్పత్రిలో జరిగిన ఘటన. ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు మాత్రం డబ్బులకు ఆశపడి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పట్టణ కేంద్రంలోని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియనన్‌ ఆపరేషన్‌ ద్వారా ప్రసవాలకే మొగ్గు చూపుతున్నారు. మాతాశిశు ఆరోగ్యం కోసం సాధారణ ప్రసవాలు చేయాలని చెబుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రైవేట్‌ వైద్యశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టానుసారంగా ఈ దందా నడుస్తోంది.

నిత్యం ఘటనలు

నిబంధనల ప్రకారం లింగ నిర్ధారణ, అబార్షన్‌లు చేయరాదని ప్రభుత్వం సూచిస్తున్నా ప్రైవేట్‌ ఆస్పత్రిలో మాత్రం నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రసవాల పేరుతో ఈ దారుణాలు నిత్యకృత్యమైనా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గైనకాలజిస్ట్‌లు అడ్డగోలుగా ప్రసవాలు, అబార్షన్‌లు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గర్భం దాల్చిన మహిళ 23 వారాల లోపు ఉండి, ఏదైనా సమస్య ఉంటే అందరి ఆమోదంతో అబార్షన్‌ చేయాలని నిబంధనాలున్నాయి. కానీ ఇటీవల విజేత ఆస్పత్రిలో జరిగిన ఘటనను చూస్తే 26 వారలకు పైగా కవలలు ఉన్నారని, ఆ గర్భిణికి ఎలాంటి ఇబ్బందులు లేకున్నా డబ్బులకు ఆశపడి అబార్షన్‌ చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆస్పత్రి వర్గాలకు అధికారులు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఒకటి రెండు రోజుల్లో చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.

మామూళ్ల మత్తు

ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్న వారిలో రిస్క్‌, హైరిస్క్‌ ఉన్న వారికి మాత్రమే సిజేరియన్‌ ద్వారా ప్రసవాలు చేస్తుండగా, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాత్రం ఎలాంటి రిస్క్‌, హైరిస్క్‌ లేకున్నా సిజేరియన్‌కే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ముహూర్తం ప్రకారం ప్రసవాలు చేస్తామని చెబుతుండటం గమనార్హం. అంతే కాకా గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రసవాలు జరిగితే వచ్చే ఫీజు చాలా తక్కువ. సిజేరియన్‌ల ద్వారా దాదాపు రూ.70వేల నుంచి రూ.లక్షకు పైగా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇంత తతంగం జరుగుతున్నా మామూళ్ల మత్తులో ఉన్న వైద్యారోగ్యశాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు.

షోకాజ్‌ నోటీసులు జారీ

పట్టణంలో ఇటీవల జరిగిన ఘటనపై ఆస్పత్రికి షోకాజ్‌ నోటీసులు అందజేశాం. ఎంటీపీ కమిటీ మీటింగ్‌ నిర్వహించి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాం. నోటీసులకు వచ్చే సమాధానంపై ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు.

– లలితాదేవి, జిల్లా వైద్యాధికారి

నొప్పులతో వస్తే కాన్పు చేశాం

పురిటి నొప్పులతో వస్తేనే కాన్పు చేశామని విజేత ఆస్పత్రి వైద్యురాలు నవత అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. నందిని అనే మహిళకు పైళ్లె ఏడాదిన్నర అయినా గర్భం దాల్చక పోవడంతో చికిత్స కోసం వచ్చిందన్నారు. దీంతో రెండు నెలల్లోనే ఆమె గర్భం దాల్చిందన్నారు. అప్పటి నుంచి ప్రతి నెలా ఇక్కడే చికిత్స చేయించుకుంటున్నారు. ఇటీవల నందిని భర్తకు ఆరోగ్యం బాగలేకపోయిన మధ్యలో చికిత్స చేయించుకుంది. ఆమెకు కడుపునొప్పి వచ్చిన ప్రతిసారీ కుటుంబసభ్యులు, అత్తామామకు చెప్పాం. నొప్పులతో ఈ నెల 7న ఆస్పత్రికి రావడంతో కాన్పు చేయాలని సూచించాం. ఈ విషయాన్నిఆమె అత్తామామకు తెలియజేశాం. రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పు చేశాం. కానీ అబార్షన్‌ చేశారని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఉన్నతాధికారులకు ఈ వ్యవహారంపై నివేదిక అందజేశామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement