ధారూరు: అన్యాక్రాంతమవుతు న్న అటవీ భూములపై ఉన్నతాధికారులు స్పందించారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘కొన్నది కొంత–కొల్లగొట్టింది ఎంతో, పోతులవాగు స్వాహా’ తదితర కథనాలకు అటవీశాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ ఆఫ్ చీఫ్ కన్జర్వేటర్ అధికారి సువర్ణ స్పందించారు. ఆమె ఆదేశం మేరకు శుక్రవారం మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామ సమీప సర్వేనంబర్ 11లోని అటవీ భూమిలో విజిలెన్స్ అధికారులు పర్యటించారు. అటవీశాఖ విజిలెన్స్ డిస్ట్రిక్ట్ ఫారెస్టు ఆఫీసర్ రాజశేఖర్, ఎఫ్‌ఆర్‌ఓ వీరేశం, ధారూరు ఫారెస్టు రేంజర్ రాజేందర్, ఇతర అధికారులు ఫారెస్టు భూమి, ఎఫ్ బ్లాక్‌లోని గెజిట్ మ్యాప్‌ను పరిశీలించారు. ఫారెస్టు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేయిస్తే అటవీ భూమి ఎంత ఆక్రమణకు గురైందో తెలుస్తోందని తేల్చారు. గతంలో కందకాన్ని ఇద్దరు వ్యక్తులు తమ పొలంలో కలుపుకొన్నట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అటవీ భూమి ఎంత, వాటి హద్దు లెక్కడ అనేది గుర్తించలేక పోయారు. జాయింట్ సర్వేలో హద్దులు గుర్తిస్తేనే ఫారెస్టు భూమి ఎంతమేరకు కబ్జాకు గురైందని బయటపడుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పీసీసీఎఫ్‌కు నివేదించేందుకు నిర్ణయించారు.
సంయుక్త సర్వే చేయాలని నిర్ణయించిన విజిలెన్స్ అధికారులు
అటవీ భూమి కబ్జాపై విచారణ