
ఆర్టీసీకి ‘ప్రైవేటు’ గండి
● పరిగి బస్టాండ్ ఎదుట పెద్ద సంఖ్యలో ప్రైవేటు వాహనాలు ● నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల తరలింపు ● పట్టించుకోని అధికారులు
పరిగి: నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వాహన యజమానులు ప్రయాణికులను తరలించి ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. పరిగి బస్టాండ్ ఎదుట ఉదయం నుంచే ప్రైవేటు వాహనాలను నిలుపుతున్నారు. బస్టాండ్‌లోకి వెళ్లే ప్రయాణికులను ఆపి తమ వాహనాల్లో ఎక్కించుకుంటున్నారు. జిల్లాలోని నాలుగు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద (పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్) ఇదే పరిస్థితి నెలకొంది. నిత్యం కొడంగల్, పరిగి, తాండూరు ప్రాంతాల నుంచి ఎక్కువ మంది హైదరాబాద్‌కు వెళ్తుంటారు. ప్రైవేటు వాహన యజమాను లు వారిని నిబంధనలకు విరుద్ధంగా తరలించి ఆర్టీసీకి రావాల్సిన ఆదాయన్ని కొళ్లగొడుతున్నారు.
నిబంధనలు గాలికి
మోటారు వెహికల్ చట్టం ప్రకారం ఆర్టీసీ బస్టాండ్‌కు 500 మీటర్ల పరిధిలో ప్రైవేటు వాహనాలను నిలుపరాదు. కానీ పరిగి పట్టణంలో ఇది అమలు కావడం లేదు. నిబంధనలను తుంగలో తొక్కి బస్టాండ్ ఎదుటే వాహనాలను నిలిపి ప్రయాణికులకు ఎక్కించుకుంటున్నారు. ఆర్టీసీ సర్వీసులు సమయానుకూలంగా నడపకపోవడం ప్రైవేటు వాహనాలకు కలిసి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో మహిళల సంఖ్య అధికంగా ఉంటోంది. దీంతో సీట్లు లేక పురుషులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్టాండ్ ముందే ప్రైవేటు వాహనాలను నిలుపుతున్నా ఆర్టీసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
కనిపించని స్పెషల్ టీంలు
ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి అందులో పోలీసు శాఖను భాగస్వామ్యం చేస్తూ బస్టాండ్‌కు 500 మీటర్ల పరిధిలో ప్రైవేటు వాహనాలను నిలిపితే చర్యలు తీసుకోవాలి. కొన్ని నెలలుగా ఈ టీంలు పనిచేయడం లేదు. దీంతో ప్రైవేటు వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రైవేటు వాహనాలను ఆపితే చర్యలు తీసుకుంటాం. మోటారు వెహికల్ చట్టాన్ని విధిగా పాటించాలని ఆదేశాలు జారీ చేస్తాం. బస్టాండ్ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి ప్రైవేటు వాహనాలను కట్టడి చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి.
– సుఖేందర్‌రెడ్డి, డీఎం, పరిగి