
ద్రవరూపంలో యూరియా
మోమిన్‌పేట: కేంద్ర ప్రభుత్వం గుళికల రూపంలో ఉన్న యూరియా, డీఏపీలకు బదులుగా ద్రవ రూపంలో తయారు చేస్తుంది. దీంతో రైతుకు రవాణా, దూరభారం, ధర తగ్గుతుంది. అర లీటరు నానో యూరియా, డీఏపీ ఒక బస్తా యూరియా, డీఏపీతో సమానం. పత్తి, కూరగాయల సాగుకు పైపాటుగా పిచికారీ చేయాలి. దుకాణం నుంచి తీసుకురావడం, పొలానికి తీసుకుపోవడం నానో యూరియా, డీఏపీ చాలా సులువు. అదే బస్తా తీసుకెళ్లడంతో అన్నదాతలకు భారం అవుతుంది. ఒక బస్తా గుళికల యూరియా ఎకరా పొలంలో వాడటంతో 60 శాతం మాత్రమే మొక్క గ్రహించ గలుగుతుంది. మిగతా 40శాతం గాలిలో కలిసి వాయు కాలుష్యం ఏర్పడుతుంది. డీఏపీ కూడా దుక్కిలో వేయాల్సి ఉన్న పైపాటుగా వేయడంతో నష్టమే కానీ మొక్కకు ఎలాంటి ఫలితం దక్కదు. రైతులు నానో యూరియా, డీఏపీలను నేరుగా కానీ ఏదైన పురుగు మందులో కలిపి పత్తిపై పిచికారీ చేయాలి. పిచికారీ చేయడంతో నేరుగా ఆకులు ద్వారా మొక్క వంద శాతం గ్రహిస్తుంది. రసాయనిక ఎరువులు నేరుగా భూమిలో వేయడంతో భూ సాంద్రత తగ్గుతుంది. వర్షాభావ పరిస్థితిలో, అధిక వర్షపాతంలోను నానో యూరియాను పంటపై పిచికారీ చేయవచ్చు. దీంతో పంట ఎదుగుదల ఎక్కడ ఆగదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం డీఏపీని కూడా ద్రవ రూపంలో తయారు చేస్తుంది. రైతులు సేంద్రియ ఎరువులను భూమిలో వేసి కలియ దున్నుకొని నానో ఎరువులను పంటలపై పిచికారీ చేస్తే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు సూచించారు.
అవగాహన కల్పిస్తున్నాం
ప్రస్తుతం పత్తి విత్తనాలు విత్తుకొని నెల రోజులు కావొస్తుంది. వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తున్నాయి. పైపాటుగా నానో డీఏపీని మొదటి సారి పిచికారీ చేసుకోవచ్చు. తిరిగి రెండోసారి 50 రోజులకు పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు ఒక లీటరు రెండు దఫాలుగా పిచికారీ చేయాలి. నానో ఎరువులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంకా చాలా మంది రైతులకు నానో డీఏపీ, యూరియాలపై అవగాహన లేదు. ప్రతి ఫర్టిలైజరు దుకాణాలలో విరివిగా నానో యూరియా, డీఏపీలను అందుబాటులో ఉంచాలి. రానురాను అన్ని రసాయనిక ఎరువులు ద్రవ రూపంలో వస్తాయి. – జయశంకర్, ఏఓ, మోమిన్‌పేట
నానో డీఏపీతో రైతుకు ప్రయోజనం
ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ద్రవరూపంలో యూరియా