
విద్యార్థుల ఆకలి కేకలు!
● మైల్వార్ ప్రాథమిక పాఠశాలలో అందని మధ్యాహ్న భోజనం ● ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదని నిర్వాహకుల నిరసన ● పస్తులతో అవస్థలు పడిన 150 మంది చిన్నారులు
బషీరాబాద్: మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. మండల పరిధిలోని మైల్వార్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1నుంచి 5 తరగతుల వరకు 150 మంది బాలబాలికలు చదువుకుంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు భువనేశ్వరీ, ప్రమీళ, సంగీత వీరికి నిత్యం మిడ్ డేమీల్స్ వండిపెట్టేవారు. బిల్లులు రావడం లేదని వంట చేయలేదు. సోమవారం మధ్యా హ్నం లంచ్ బెల్ కొట్టగానే విద్యార్థులు రోజూ మాదిరిగానే ప్లేట్లు పట్టుకుని బయటకు వచ్చారు. ఈ సమయంలో.. ‘బిల్లులు రావడం లేదని ఏజెన్సీ వాళ్లు వంట చేయలేదు. మీరంతా ఇళ్లకు వెళ్లి తిని రావాలి’ అని ఉపాధ్యాయులు చెప్పారు. అప్పటికే ఆకలితో అలమటిస్తున్న చిన్నారులు ఇళ్లకు పరుగులు తీశారు. కొంతమంది భోజనం చేసి రాగా, ఇళ్లకు తాళాలు వేసి పొలం పనులకు వెళ్లిన వారి పిల్లలు కడుపు మంటతోనే తిరిగొచ్చారు. సాయంత్రం వరకూ ఆకలితోనే అలమటించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులను నిలదీశారు. వంట వండటం లేదని ముందే చెబితే తాము టిఫిన్లు కట్టి పంపించే వాళ్లమని హెచ్‌ఎం వెంకటప్పపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని తాను ఎంఈఓకు చెప్పగా ఏజెన్సీ వాళ్లకు నచ్చజెప్పాలని సూచించారని, నిర్వాహకులు మాత్రం వినలేదని తెలిపారు.

విద్యార్థుల ఆకలి కేకలు!