
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
తాండూరు రూరల్: ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. తాండూరు మండలం ఎల్మకన్నెలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎల్మకన్నె గ్రామానికి చెందిన సయ్యద్ ముజాయిద్(40) తన ఎకరా పొలంలో వ్యవసాయంతో పాటు చిన్నచిన్న కరెంట్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలానికి చెందిన గోపాల్ రాథోడ్‌కు ఎల్మకన్నె శివారులో ఓ ఫాంహౌస్ ఉంది. ఇందులో మామిడితోట సాగు చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఫాంహౌస్‌కు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న యజమాని గురువారం ఉదయం ముజాయిద్‌ను తీసుకురావాలని తన వద్ద పని చేసే నర్సింలును పంపించాడు. ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్ చేసి, ఫ్యూజ్ వైర్ వేసిన అనంతరం ముజాయిద్ కిందకు దిగాడు. ఈక్రమంలో అతని చెప్పు ట్రాన్స్‌ఫార్మర్ కిందిభాగంలో ఎర్తింగ్ పట్టీ కింద ఇరుక్కుపోయింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరించిన అనంతరం ముజాయిద్ ఓ కట్టె సాయంతో తన చెప్పును తీసుకునే ప్రయత్నం చేస్తుండగా.. 11కేవీ జంపర్ తగిలి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
మృతదేహంతో బైఠాయింపు..
ఫాంహౌస్ యజమాని నిర్లక్ష్యం కారణంగానే ముజాయిద్ చనిపోయాడని ఆరోపిస్తూ అతని బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. సుమారు 5గంటల పాటు ఫాంహౌస్‌లో నిరసన తెలిపారు. మృతునికి భార్య ఫర్వీన్ బేగం, కుమారులు ముస్తాఫా, సమీర్, కుతూరు సిమ్లా ఉన్నారు. ఫర్వీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.
యజమాని నిర్లక్ష్యం..
కళ్లమందే కరెంట్‌షాక్‌కు గురై కింద పడిపోయిన ముజాయిద్‌ను ఆస్పత్రికి తరలించడంలో ఫాంహౌస్ యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించాడని బాధితులు, స్థానికులు ఆరోపించారు. అక్కడే ఉన్న అతని కారులో ఆస్పత్రికి తీసుకెళ్తే బతికేవాడని మండిపడ్డారు. అలా కాకుండా గ్రామంలోకి వెళ్లి ఆటో తీసుకువచ్చి, ఆస్పత్రికి వెళ్లేసరికి చాలా ఆలస్యమైందని బాధితులు వాపోయారు.
ట్రాన్స్‌ఫార్మర్ కింద ఇరుక్కుపోయిన చెప్పును తీస్తుండగా ప్రమాదం
తాండూరు మండలం ఎల్మకన్నెలో ఘటన
మృతదేహంతో బాధితుల ఆందోళన

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి