కేజీబీవీలో ఎంఎల్‌టీ కోర్సు
యాచారం: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఏడాది నుంచి ఎంఎల్‌టీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) ఇంటర్ కోర్సు ప్రారంభిస్తున్నట్లు విద్యాలయ ప్రత్యేకాధికారి అరుణశ్రీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోర్సులో 40 సీట్ల చొప్పున భర్తీ చేస్తామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో తరగతులు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు 83318 33426 నంబర్‌లో సంప్రదించాలని ఆమె సూచించారు. ఎంఎల్‌టీ బోధించడానికి ఆసక్తి కలిగిన అధ్యాపకులు కూడా సంప్రదించాలన్నారు.
నెల రోజులకు
కుటుంబం చెంతకు
యాచారం: మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో నెల రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి శనివారం కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్కాపురం నర్సింహ మే 7న ఇంటి నుంచి పని కోసమని వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాల్లో, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన జాడలేకపోవడంతో గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నల్లగొండ, నాగర్‌కర్నూల్, హైదరాబాద్ జిల్లాల్లోని పలు చోట్ల వెతికి శనివారం నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో నర్సింహ సంచరిస్తుండగా గుర్తించి తీసుకొచ్చారు. కుర్మిద్దలోని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అదుపు తప్పి రేకులషెడ్డును ఢీకొట్టి
● రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం
● మరో విద్యార్థికి తీవ్ర గాయాలు
ఇబ్రహీంపట్నం: అదుపు తప్పిన బైక్ రేకుల షెడ్‌ను ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జగదీశ్ కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన రుతికేష్(20) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాలలో శుక్రవారం ఫేర్‌వెల్ పార్టీ అనంతరం స్నేహితుడు సంజయ్ ఉంటున్న మంగల్‌పల్లి హాస్టల్‌కు మరో స్నేహితుడు శంకర్‌తో కలిసి బైక్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత శేరిగూడ గాంధీ విగ్రహం వద్దకు రాగానే వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి మెడికల్ షాపు ముందున్న రేకుల షెడ్‌కు ఢీకొట్టింది. ఈ ఘటనలో రుతికేష్ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన శంకర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పేదలను అన్నివిధాలా ఆదుకుంటాం
మణికొండ: పేద విద్యార్థుల చదువులు, అనారోగ్యాలు, వివాహాలకు ఆర్థిక సాయంతోపాటు అన్ని విధాలా ఆదుకుంటామని వట్టినాగులపల్లి మాజీ సర్పంచ్ జి.స్వరూప నగేష్‌యాదవ్ అన్నారు. శనివారం గ్రామానికి చెందిన బుడల పెంటయ్య కూతురు వివాహానికి రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని ఆమె అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మనకు ఉన్న దాంట్లో కొంత లేని వారికి ఇస్తే మానసిక సంతృప్తి మిగులుతుందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లోనూ నిర్విరామంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులున్నా పేదలు తమను సంప్రదించాలని వారికి తగిన సాయం చేస్తామని ఆమె వెల్లడించారు. ఇప్పటి వరకు వంద మందికి పైగా ఆర్థికంగా ఆదుకున్నామని తెలిపారు.
కేజీబీవీలో ఎంఎల్‌టీ కోర్సు


