నిరీక్షణకు మోక్షం..
● బషీరాబాద్‌లో ఎట్టకేలకు ఇంటర్ తరగతులు ● 8 మంది ఫ్యాకల్టీని నియమించిన ప్రభుత్వం ● కళాశాలకు భవనం కేటాయింపు ● ఊపందుకున్న అడ్మిషన్లు
బషీరాబాద్: ఇంటర్ విద్యార్థుల రెండేళ్ల నిరీక్షణకు మోక్షం లభించింది. 2023లో బషీరాబాద్‌కు జూనియర్ కళాశాల మంజూరైంది. గతేడాది అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించినా భవనం లేకపోవడం, లెక్చలర్లను నియమించకపోవడంతో విద్యార్థులను తాండూరు జూనియర్ కాలేజీలో చేర్పించారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వం బషీరాబాద్ కశాశాలకు 8మంది ఫ్యాకల్టీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అడ్మిషన్లు ఊపందుకున్నాయి. మండల కేంద్రంలో దశాబ్దాలుగా ఇంటర్ కళాశాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం కళాశాలను మంజూరు చేసింది. రెండేళ్లయినా తరగతులు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు నిరుత్సాహ పడ్డారు. గతేడాదిలో 34 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు పొందారు. అయితే ప్రభుత్వం లెక్చలర్లను నియమించకపోవడంతో విద్యార్థులను తాండూరు జూనియర్ కాలేజీలో చేర్చారు. ప్రస్తుతం సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడటంతో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌సీ తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. అధ్యాపకులు ఇంటింటికి తీరుగుతూ విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కళాశాలకు సొంత భవనం లేకుపోవడంతో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని భవనాన్ని కేటాయించారు. బుధవారం భవనాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి, అజయ్‌ప్రసాద్, కళాశాల సిబ్బంది పరిశీలించారు. చిన్న చిన్న మరమ్మతులు చేస్తే తరగతులు నిర్వహించవచ్చని భావిస్తున్నారు.


