
అటవీ భూమి ఆక్రమణ!
చెట్లు నరికి మట్టి రోడ్డు ఏర్పాటు
● వారం రోజుల క్రితం డీఎఫ్‌ఓకు ఫిర్యాదు ● ఆలస్యంగా వెలుగులోకి..
బొంరాస్‌పేట: ఒక చెట్టు ఒక మనిషితో సమానం అని చెప్పే అటవీశాఖ అధికారులు చెట్లను నరికి అడవిని కబ్జా చేస్తున్నా పట్టించుకోవడంలేదు. అటవీ భూమి ఆక్రమణపై కొంత మంది రైతులు డీఎఫ్‌ఓకు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొంరాస్‌పేట మండలం ఎన్కేపల్లి, రేగడిమైలారం, వడిచర్ల గ్రామాల శివారులో రెవెన్యూ రికార్డుల ప్రకారం తిర్మలాపూర్ అనే గ్రామం ఉంది. ఇక్కడ చాలా కాలం నుంచి జన సంచారం లేకపోవడంతో అటవీప్రాంతంగా మారిపోయింది. గతంలో టెనెంట్ పట్టా కింద గ్రామ శివారులో ఎన్కేపల్లికి చెందిన పూజారి కుటుంబానికి చెందిన పలువురు దాయాదులకు సర్వే నం.13, 15, 19లో పట్టా భూమి ఉంది. అందులో వీఎస్‌ఎస్ మాజీ చైర్మన్, ప్రస్తుత ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూజారి నర్సింలుకు సైతం 4.9ఎకరాల భూమి ఉంది. దీనికి సమీపంలోని అటవీ భూమిని కబ్జా చేస్తూ వచ్చాడు. అడవిలోని ఆలయాలకు మట్టి రోడ్డు వేస్తున్నట్లు అక్కడి రైతులను నమ్మించాడు. అనంతరం తన పొలానికి.. ఆక్రమించిన అటవీ భూమిలో మట్టి రోడ్డు వేశాడు. అక్కడి నుంచి తిర్మలాపూర్ శివారులోని అటవీప్రాంతం(ఆర్‌ఎఫ్)లోకి ప్రవేశించి జేసీబీతో ట్రెంచింగ్‌ను పూడ్చివేసి, మట్టిని తవ్వి, చెట్లను నరికి రోడ్డు ఏర్పాటు పనులు చేపట్టాడు. ఇందుకోసం దాదాపు 200ల చెట్లను నరికేసినట్లు సమాచారం. 20 లారీల మట్టి తవ్వి సుమారు అర కిలోమీటరు మేర మట్టి రోడ్డు వేశాడు. తన పొలం పక్కన ఉన్న నాలుగు ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఫారెస్ట్ అధికారుల దృష్టికి వెళ్లడంతో నర్సింలుపై నష్టపరిహారంతోపాటు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అటవీ భూమిని ఆక్రమించి రోడ్డు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఆర్‌ఓ సవిత తెలిపారు. అటవీ భూమిని స్వాధీనం చేసుకోవడంతోపాటు మట్టిరోడ్డును తొలగిస్తామని అన్నారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ పరిశీలన
అటవీ భూమి కబ్జా, మట్టి రోడ్డు ఏర్పాటుపై ఈనెల 15న కొంత మంది రైతులు డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు స్పందన కనిపించలేదు. ఈ విషయం అటవీశాఖ ఉన్నత స్థాయి అధికారులకు తెలియడంతో శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్ కబ్జాకు గురైన భూమిని పరిశీలించేందుకు వచ్చింది.
కఠిన చర్యలు తప్పవు
అటవీ భూమిని ఆక్రమించడం, మట్టి రోడ్డు వేయడం వాస్తవం. ఇది చట్టరీత్యా నేరం. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. ఇప్పటికే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశాం. జరిమానా విధించడం తోపాటు అడవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయిస్తాం. కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటాం.
– జ్ఞానేశ్వర్, డీఎఫ్‌ఓ

అటవీ భూమి ఆక్రమణ!

అటవీ భూమి ఆక్రమణ!