
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు
బీబీనగర్: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బీబీనగర్ సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మొయినాబాద్‌కు చెందిన చేగూరి రామస్వామిగౌడ్(60), లక్ష్మి దంపతులు వారి కోడళ్లు భూమిక, మనీషతోపాటు వీరి పిల్లలు అక్షిత్, అక్షయ్, శ్రీయాంక, సహస్రలతో కలిసి గురువారం సాయంత్రం కారులో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహ స్వామి దర్శనానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. బీబీనగర్‌కు రాగానే జాతీయ రహదారిపై ఉన్న ఫ్లైఓవర్ సమీపంలో కారు అదుపు తప్పి సర్వీస్ రోడ్డుపైకి పల్టీ కొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసం కాగా.. వాహనంలోని ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను బయటకు తీశారు. నేషనల్ హైవే అంబులెన్స్‌లో వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా రామస్వామి, లక్ష్మితోపాటు, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రామస్వామి మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.
ఒకరి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం