
బస్తాకు 41 కిలోలే ఫైనల్
● ఎక్కువ ధాన్యం తూకం వేస్తేకఠిన చర్యలు ● అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
బషీరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు 41 కిలోలే వడ్లు తూకం వేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ నిర్వాహకులను ఆదేశించారు. అంతకంటే ఎక్కువ తూకం వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం సాక్షి దినపత్రికలో మిల్లర్ల మాయాజాలం.. ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. మండలంలోని కాశీంపూర్, మైల్వార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తాలు సాకుతో ఒక్కో బస్తాకు 42 నుంచి 42.50 కిలోలు ధాన్యం తూకం ఎందుకు వేశారని కేంద్రం నిర్వాహకులను ప్రశ్నించారు. వాస్తవానికి ఒక్కో బస్తాకు 40.650కిలోలే తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ఎక్కడైన తాలు ఉంటే బస్తాకు 41కిలోలు తూకం వేయాలని సూచించారు. మిల్లర్లు చెప్పారని 42 కిలోలపైన తూకం వేయడంపై ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందిపై మండిపడ్డారు. ఇక నుంచి ధాన్యం శుభ్రపరచడానికి జిల్లాకు 50 ప్యాడీ క్లీనర్ యంత్రాలు వచ్చినట్లు వివరించారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు 24లక్షల గన్నీ బ్యాగులు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అందనంగా 25లారీలు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 45వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బషీరాబాద్ డీటీ రుక్సానా బేగం, ఏపీఎం పద్మరావు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

బస్తాకు 41 కిలోలే ఫైనల్