
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
● కలెక్టర్ ప్రతీక్ జైన్
దౌల్తాబాద్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నతశిఖరాలు చేరుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ యువతకు సూచించారు. మండల కేంద్రంలో రూ.68 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని శుక్రవారం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దౌల్తాబాద్‌లో అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మించామని తెలిపారు. ఇక్కడ చిన్న పిల్లలకు, నిరుద్యోగ యువతకు, అన్ని వర్గాల వారికి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పిల్లలకు ఆట వస్తువులు, కంప్యూటర్లు ఉన్నట్లు తెలిపారు. సంస్థ ప్రతినిధులు కంప్యూటర్‌పై శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని యువకులు, పిల్లలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వికారాబాద్, నారాయణపేట జిల్లాల చైర్మన్లు రాజేశ్‌రెడ్డి, వార్ల విజయ్‌కుమార్, తహసీల్దార్ గాయత్రి, ఎంపీడీఓ శ్రీనివాస్, నాయకులు వెంకట్రావు, వీరన్న, వెంకట్‌రెడ్డి, విజయ్‌కుమార్, ప్రమోధ్‌రావు, రెడ్డి శ్రీను రాజశేఖర్‌రెడ్డి, రాజు, నర్సప్ప, తదితరులు పాల్గొన్నారు.