
నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యం
తాండూరు: నియోజకవర్గంలోని ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగ కల్పనే లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ నెల 29న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన వాల్‌పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడాదిన్నర సమయంలోనే స్థానిక పరిశ్రమల్లో యువత ఉద్యోగాలు కల్పించామన్నారు. జిన్‌గుర్తి పారిశ్రామిక వాడ పనులు సైతం వేగంగా కొనసాగతున్నాయన్నారు. తాండూరు నాపరాతి పాలిషింగ్ యూనిట్‌లకు కేంద్రంగా ఉండేదని గత పాలకుల స్వార్థంతో నాపరాతి పరిశ్రమలు కర్ణాటకకు తరలిపోతున్నాయన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 50 కంపెనీలలో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఈ నెల 29న తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేగా ఉద్యోగ జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. రెండు నెలల క్రితం నిర్వహించిన మహిళా జాబ్ మేళా ద్వారా 120 మంది మహిళలు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు పట్లోళ్ల బాల్‌రెడ్డి, మాధవరెడ్డి, బీసీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌చంద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాల, మండలాల అధ్యక్షులు నర్సింహులు, గోపాల్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులున్నారు.
భూ బాధితులకు పరిహారం
తాండూరు పట్టణ శివారులో నర్సింగ్ కళాశాల నిర్మాణంలో భూమి కోల్పోయిన ఇద్దరు మహిళా రైతులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి నష్ట పరిహారం అందించారు. బషీర్‌మియా తండాకు చెందిన కేతావత్ మల్కిబాయి, కేరిబాయిలకు సర్వేనెంబర్ 52/7లో మూడు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ప్రభుత్వం నర్సింగ్ కళాశాల నిర్మాణం కోసం స్వాధీనం చేసుకొంది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో వారికి రూ.54 లక్షల పరిహారం చెక్కులను అందజేశారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి