
మిల్లులకు ధాన్యం బస్తాలు
బషీరాబాద్: మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం బస్తాలపై మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ఎక్కడి వడ్లు అక్కడే శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు స్పందించారు. కాశీంపూర్, మైల్వార్, నావంద్గీ, దామర్‌చెడ్ కేంద్రాలకు ఏడు లారీలను పంపారు. కాశీంపూర్ నుంచి 1,410 బస్తాలు, మైల్వార్ నుంచి 1,950, నావంద్గీ, దామర్‌చెడ్ కేంద్రాల నుంచి 1,226 బస్తాల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మరో 10వేల బస్తాలు ఆయా కేంద్రాల్లోనే ఉన్నట్లు తెలిసింది. ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు కాంట్రాక్టర్‌పై డీఎస్‌ఓ మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సాక్షి కథనంపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి స్పందించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తూకం చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని ఆదేశించారు. వర్షాలు పడుతున్నందున వడ్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నావంద్గీ సొసైటీ చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డికి ఫోన్ చేసి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. దీంతో వారు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు.
ఏడు లారీల ద్వారా 4,500 బ్యాగుల తరలింపు

మిల్లులకు ధాన్యం బస్తాలు