
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
అనంతగిరి: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా పీఎస్‌ల వారీగా నమోదైన కేసుల సంఖ్య, పురోగతిపై సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ కళాశాల బృందాలచే ప్రజలకు అవగాహన, ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇసుక, గుట్కా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత పటిష్టం చేయాలన్నారు. ప్రజలకు సీసీ కెమెరాల ప్రాధాన్యత వివరించి వాటి ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా నిఘా పెంచాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఎరువులు, విత్తనాల దుకాణాలపై దాడులు నిర్వహించాలని తెలిపారు. తక్కువ ధరకు విత్తనాలు ఇస్తామని చెప్పేవారిని నమ్మవద్దని, లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే కొనుగోలు చేయాలని చెప్పారు. త్వరలో బక్రీద్ పండుగ ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలన్నారు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలని సిబ్బందికి సూచించారు. పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించి ప్రజల సహకారంతో పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ టీవీ హన్మంత్‌రావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలి
ఎస్పీ నారాయణరెడ్డి

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు