
కార్మిక సమస్యలు పరిష్కరించండి
అనంతగిరి: కార్మిక సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వికారాబాద్ మార్కెట్ యార్డు నుంచి ఆర్‌డీఓ కార్యాలయం వరకు సీఐటీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అలాగే పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రతి నెలా ఒకటో తేదీ వేతనాలు వచ్చేలా చూడాలన్నారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికారాబాద్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. కార్మికులకు 8 గంటల పనివిధానం అమలు చేయాలని విన్నవించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో ఆయా యూని యన్ల నాయకులు అమృత, భారతి, రేణుక, పెంటమ్మ, నర్సింలు, నీలమ్మ, శంకర్, శివకుమార్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్