ఎమ్మెల్యే బీఎమ్మార్
తాండూరు టౌన్: ఆలయాల అభివృద్ధి కోసం కమిటీ సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. గురువారం తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవస్థాన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. తాండూరు నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాలకు పాలక మండలిని ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తోందన్నారు.
అనంతరం దేవాదాయశాఖ అధికారులు ఆలయ పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ధారాసింగ్, ఉత్తం చంద్, డాక్టర్ సంపత్ కుమార్, ఆధ్యాత్మిక గురువు శంకర్ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ప్రత్యేక లోక్ అదాలత్
చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ మార్గం
తాండూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శివలీల
తాండూరు టౌన్: తాండూరు కోర్టులో ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వ హించనున్నట్లు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శివలీల గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచన మేరకు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. చెక్ బౌన్స్ కేసుల విషయంలో ఇరువర్గాల అంగీకారం మేరకు కేసులను పరిష్కరించనున్నట్లు పేర్కొ న్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప
తాండూరు టౌన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యు.బుగ్గప్ప గురువారం ఒక ప్రకటనలో కోరారు. జాబితాలో నిరుపేదలు, ఇళ్లు లేని వారిని మాత్రమే చేర్చాలన్నారు. ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉంటున్న, సొంత స్థలం ఉన్నప్పటకీ అద్దెకు ఉంటున్న వారికి, కడు పేదరికంలో ఉన్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గతంలో ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఫొటో మానిటరింగ్ సిస్టమ్ ఉండేదని, పారదర్శకత కోసం అధికారులు నేరుగా పేదలు నివసించే ప్రాంతానికి వెళ్లి లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. అనర్హులకు ఒక్క ఇళ్లు ఇచ్చినా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
రాజీవ్ యువ వికాసానికి 3,184 దరఖాస్తులు
తాండూరు రూరల్: రాజీవ్ యువ వికాసం పథకానికి పెద్దేముల్ మండలం నుంచి 3,184 దరఖాస్తులు వచ్చినట్లు ఆ మండల ఎంపీడీఓ రతన్‌సింగ్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు హార్డ్ కాఫీ, బ్యాంక్ ఖాతా నంబర్, పాన్, ఆధార్ కార్డులు, కులం, ఆదాయం సర్టిపికెట్లను పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలని సూచించారు. సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే బ్యాంక్ అధికారులకు దరఖాస్తు ఫారాలు అందజేశామని పేర్కొన్నారు. మండల స్థాయి అధికారుల కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ కింద 244 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు.

ఆలయాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయండి