
సమస్యల బాలకేంద్రం
● మౌలిక వసతులు లేక చిన్నారుల పాట్లు ● ప్రహరీ లేక ఇబ్బందులు ● శిథిలావస్థలో భవనం
అనంతగిరి: చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన బాలకేంద్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వేసవి సెలవుల్లో పిల్లలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు 1982లో వికారాబాద్‌లో బాలకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఐదు గదుల్లో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. కార్యాలయ గది గోడకు పగుళ్లు వచ్చాయి. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కిటికీలు, తలుపులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షం వస్తే గదుల్లోకి నీరు చేరుతోంది. ఏళ్ల తరబడిగా భవనం మరమ్మతులకు నోచుకోవడం లేదు. కేంద్ర చుట్టూ గడ్డి ఏపుగా పెరిగి విషపురుగులకు నిలయంగా మారింది. ప్రహరీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం బాల కేంద్రంలో సమ్మర్ క్యాంపు మొదలైంది. గత నెల 26 నుంచి చిన్నారులకు ఉదయం 9నుంచి మధాహ్నం 12.30గంటల వరకు భరతనాట్యం, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాప్ట్, తబలా, బుక్ రీడిండ్ తదితర వాటిలో శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 200లకు పైగా పిల్లలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి అనుభవజ్ఞలైన సిబ్బంది ఉంది. వేసవి శిబి రం కావడంతో చిన్నారులు పెద్ద సంఖ్యలో వస్తు న్నారు. అయితే సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న గదులు సరిపోక వరండాలో భరత నాట్యం నేర్పుతున్నారు.
రాణిస్తున్న చిన్నారులు
ఇక్కడ శిక్షణ పొందుతున్న చిన్నారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఎక్కడైనా ప్రదర్శనలు ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదని చిన్నారులు తెలిపారు. సొంతంగా డబ్బు సమకూర్చుకొని వెళ్లాల్సి వస్తోందని వివరించారు. కలెక్టరేట్‌లో జరిగే వివిధ ఉత్సవాల్లో సైతం బాలకేంద్రం చిన్నారులకు అవకాశాలు ఇవ్వాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని బాలకేంద్రంలో మౌలిక వసుతులు కల్పించడంతో పాటు, భవనానికి మరమ్మతులు చేయాలని వారు విన్నవించారు.
పెండింగ్‌లోనే అప్‌గ్రేడ్ ఫైల్
వికారాబాద్‌లోని బాలకేంద్రాన్ని బాలభవన్‌గా అప్‌గ్రేడ్ చేస్తే పిల్లలకు మరిన్ని కళలు అందుబా టు లోకి వస్తాయి. ఇందుకు సంబంధించిన ఫైల్ డైరక్టరేట్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. స్పీకర్ ప్రత్యేక చొరవ తీసుకుని బాలకేంద్రాన్ని బాలభవన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

సమస్యల బాలకేంద్రం