
ఎంసీహెచ్‌లో గర్భిణి మృతి
తాండూరు టౌన్: అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఎనిమిది నెలల గర్భిణి చికిత్స పొందుతూ మృతిచెందింది. తాండూరు మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే గర్భిణితో పాటు ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను తీసుకుందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దేముల్ మండలం పాషాపూర్‌తండాకు చెందిన సుమిత్రాబాయి (35)కి కడుపులో నొప్పి రావడంతో శనివారం ఉదయం 6గంటలకు ఎంసీహెచ్‌లో చేరింది. గంటన్నర గడిచిన తర్వాత గర్భిణితో పాటు కడుపులోని శిశువు మృతిచెందిందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. తాము ఉదయం 6 గంటలకు ఆస్పత్రికి రాగా, 7.30 గంటల వరకు ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతిచెందిందని జైసింగ్ ఆరోపించాడు. ఈక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అత్యవసర చికిత్స అందించాల్సిన సమయంలో సిబ్బంది, డాక్టర్లు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్‌ను వివరణ కోరగా సుమిత్రాబాయికి రక్తం తక్కువగా ఉందని, హిమోగ్లోబిన్ శాతం 1.8 గ్రాములు మాత్రమే ఉందని, దీంతో శ్వాస తీసుకోకలేకపోయిందని తెలిపారు. సరిపడా ఆక్సిజన్ అందకపోవడంతో సీపీఆర్ చేసినా ఫలితం లేకుండాపోయిందని స్పష్టంచేశారు. ఇందులో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు.
వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఆరోపణ
ఆక్సిజన్ అందక చనిపోయిందన్న సూపరింటెండెంట్

ఎంసీహెచ్‌లో గర్భిణి మృతి