ఉపాధి హామీ పనుల్లో అగ్రస్థానంలో జిల్లా
● ఈ ఏడాది కల్పించాల్సినపని దినాలు 67.37లక్షలు ● ఇప్పటి వరకు కల్పించింది 59.71లక్షలు ● జిల్లాలో జాబ్‌కార్డులు 1.86లక్షలు ● కూలీల సంఖ్య 3.77లక్షలు ● గత నెలతో పోలిస్తే 22 వేల మందికి అదనంగా పనులు
వికారాబాద్: జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. గత నెలతో పోలిస్తే ఈ నెలలో 22 వేల మంది కూలీలకు అదనంగా పనులు కల్పించారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతోపాటు డీఆర్డీఓ నిరంతర పర్యవేక్షణ, సమీక్షలు కూలీల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉపాఽధి హామీ పథకం పనులు చేపడుతున్న 32 జిల్లాల్లో మనం ముందు వరుసలో ఉన్నాం. నిత్యం పనుల కు హాజరవుతున్న కూలీల సంఖ్య పరంగా చూస్తే మన జిల్లా మొదటి స్థానంలో కొనసాగుతోంది. కూలీల సగటున చూస్తే రెండో స్థానంలో ఉంది. వ్యవసాయ పనులులేని కాలంలో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం 2008లో దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతున్న ఈ పథకంలో ప్రతి సంవత్సరం వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. గతేడాది కూడా రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల కల్పనలో మనం మొదటి స్థానంలో నిలువగా ఈ ఏడాది కూడా కూలీలు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఒకప్పుడు కొన్ని పనులకే పరిమితమైన ఈ పథకం ప్రస్తుతం 50 రకాలకు పైగా పనులు చే సుకోవడానికి విస్తరించారు. వ్యవసాయ అనుబంధ పనులు,పొలం గట్ల వెంబడి మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు తవ్వుకోవడం, పాఠశాల క్రీడా మైదానాల చదును చేయడం, ఫాంపాండ్స్ నిర్మా ణాలు, పశువులు, గొర్రెలు, మేకల కోసం పాకలు నిర్మించుకోవడం, మట్టి రోడ్లు వేసుకోవడం, పొలా ల్లో వర్షపు నీటి నిల్వకు రాతి, మట్టి కట్టలు ఏర్పాటు చేసుకోవడం.. ఇలా ఎన్నో పనులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు.
రూ.142 కోట్ల చెల్లింపులు
జిల్లాలో 1,86,197 జాబ్‌కార్డులు ఉండగా..3,77,0 87మంది కూలీలు ఉన్నారు.ప్రస్తుతం 32,832 మంది పనులకు వస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6,73,7496 లక్షల పనిదినాలు (మ్యాన్ డేస్) కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 5,97,1480 లక్షల పని దినా లు కల్పించారు. ఇందుకు సంబంధించి కూలీలకు రూ.142కోట్లు చెల్లించారు.గత నెలలో రోజూ దాదా పు 10 వేల మంది కూలీలు పనులకు రాగా ఈ నెల వీరి సంఖ్య 22 వేలకు పెరిగింది.ప్రస్తుతపరిస్థితుల్లో కూలి గిట్టుబాటు కావటం లేదని కూలీలు అంటున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచడానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో పంపిణీ చేసిన షెడ్ నెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు శ్రమశక్తి సంఘాల వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి ని క్షేత్రస్థాయిలో ఉపయోగించడంలేదు.
వేతనాలు అందక..
జిల్లాలో డీఆర్డీఏ శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన 200 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి వేతనాలు సక్రమంగా అందడం లేదు. అటెండర్లు, సీసీలు, ఏపీఓలు, టీఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఏపీఎంలు తదితరులు విధుల్లో ఉన్నారు. నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదని వాపోతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. పదేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.
పంచాయతీల నుంచి వసతులు
జిల్లాలో 32వేల మంది ఉపాధి పనులు చేస్తున్నారు. వారికి గతంలో షెడ్ నెట్స్, ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు అందజేశాం. వాటి లైఫ్ తక్కువగా ఉంటుంది. గ్రామ పంచాయతీల్లోని గ్రీన్ బడ్జెట్ నుంచి వసతులు కల్పించాలని ప్రభుత్వం చెబుతోంది. సాంకేతిక సమస్యల కారణంగా ఉపాధి హామీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రావడం లేదు. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుంది.
– శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి