
కరుణించమ్మా
ఇందిరమ్మా..
రెండు విడతల్లోనూ స్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు
డబుల్ ఇళ్లు కేటాయించాలి
గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం కొన్ని నిర్మాణాలు పూర్తి కాగా మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. స్థలాలు లేని వారు ఆ ఇళ్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జిల్లాకు 5,740 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి. 2016లో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆ తర్వాత వీటి సంఖ్యను 3,800కు కుదించారు. ప్రస్తుతం 2,257 నిర్మాణ దశలో ఉండగా 1,031 ఇళ్లు దాదాపు పూర్తి కావచ్చాయి. 512 ఇళ్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ధారూరులో 120 ఇళ్లు, మర్పల్లిలో 120, యాలాల మండలం కోకట్‌లో 180, తాండూరు పట్టణంలో 401, పరిగిలో 180, చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్‌లో 30 డబుల్ బెడ్‌రూం ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన కూడా ఏడాదిన్న క్రితమే పూర్తయ్యింది. కానీ ఇళ్ల కేటాయింపులో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వం స్థలాలు కూడా లేని తమకు ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని పలువురు పేదలు కోరుతున్నారు.
వికారాబాద్: ప్రభుత్వం ఏదైనా నిరుపేదలను పట్టించుకోవడంలేదు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలోనూ వారికి ఇదే అనుభవం ఎదురవుతోంది. ప్రభుత్వం ఇళ్లు లేని పేదలను రెండు కేటగిరీలుగా విభజించింది. ఇందులో స్థలం ఉండి ఇళ్లు లేని వారు.. రెండో కేటగిరీలో స్థలం కూడా లేని అత్యంత పేదలు.. సాధారణంగా ఎలాంటి గూడు లేని పేదలను సంక్షేమంలో ముందు వరుసలో కూర్చోబెట్టాలి. కానీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. స్థలాలు ఉన్న వారిని మొదటి విడతలో ఎంపిక చేయగా.. కనీసం కాసింత జాగా లేని వారిని ప్రాధాన్యతా క్రమంలో వెనక్కి నెట్టారు. రెండు విడతల్లోనూ స్థలాలు ఉన్నవారినే ఎంపిక చేశారు. దీంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు అయోమయంలో పడ్డారు. ఏడాది క్రితం ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా నుంచి 2.57లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన అధికారులు 1,48,668 మంది అర్హులని తేల్చారు. వీరిలో స్థలాలు కూడా లేని పేదలు 54,806 మంది ఉన్నట్లు గుర్తించారు.
నత్తను తలపిస్తున్న ఇళ్ల నిర్మాణం
ఏడాది గడిచినా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రక్రియ మూడు అడుగులు ముందుకు ఏడు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఇళ్ల పథకాన్ని ఎమ్మెల్యేలు అట్టహాసంగా ప్రారంభించారు కానీ వాటి నిర్వహణ విషయం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు 14వేల ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 2,285 ఇళ్లకు అనుమతులు మంజూరయ్యాయి. 300 నిర్మాణాలకు హౌసింగ్ అధికారులు మార్కింగ్ ఇచ్చారు. 77 మంది పునాది పనులు పూర్తి చేయడంతో వారికి రూ.లక్ష చొప్పున అందజేశారు. మిగతా ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. రెండో విడతలో మరో 14వేల ఇళ్లు మంజూరు కాగా.. 2,929 మందిని ఎంపిక చేశారు. అయితే లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులు.. నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇంజనీర్ల కొరత కూడా పథకం అమలుపై ప్రభావం చూపుతోంది. జిల్లా మొత్తంలో ఈ పథకం అమలు చేసేందుకు ఒక పీడీ, నలుగురు డీఈలు, ముగ్గురు ఏఈలు మాత్రమే ఉన్నారు.
జిల్లాకు మొదటి విడతలో మంజూరైన ఇళ్లు 14వేలు
ఎంపిక చేసిన లబ్ధిదారులు 2,285మంది
రెండో విడతలో మరో 14వేల ఇళ్లు
ఎంపికై న వారు 2,929 మంది
జిల్లాలో స్థలం లేని నిరుపేదలు 54,806 మంది
ఆందోళనలో అర్హులు
డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని విన్నపం
నేడు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు
కుల్కచర్ల: మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సోమవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించిన పత్రాలు అందజేయనున్నట్లు ఎంపీడీఓ రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారని తెలిపారు.