
భూములు లాక్కొని పొట్టకొట్టొద్దు
తుర్కయంజాల్: అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొహెడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 187/1లో 50 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, ప్రభుత్వం తమ భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తోందని పలువురు రైతులు వాపోయారు. కొహెడలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీవనాధారంగా ఉన్న భూమిని లాక్కొని తమ పొట్ట కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో రెవెన్యూ అధికారులు 288 ఎకరాలకు ప్రీకాస్ట్ వాల్ ఏర్పాటు చేశారని, సుమారు 100కుపైగా రైతు కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు భూమి లేని కుటుంబాలు వ్యవసాయం చేసుకుని బతకడానికి కుటుంబానికి ఎకరం, రెండు ఎకరాల చొప్పున కేటాయించాయని.. అప్పటి నుంచి ఆ భూముల్లో పలు రకాల పంటలు పండిస్తున్నామని తెలిపారు. భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోమని, పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అధికారులు భూములను లాక్కునే ప్రయత్నాలు మానుకుని పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.
రైతుల ఆందోళన