
పట్టాలెక్కని పర్యాటకం
వికారాబాద్: జిల్లాలో పర్యాటక అభివృద్ధి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది.. వికారాబాద్ సమీపంలో అనంతగిరి కొండలు, కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులు, బుగ్గ రామేశ్వర ఆలయం వంటి చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అనంతగిరి కొండలను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. మెఘా సంస్థ రూ.1,000 కోట్లతో అనంతగిరిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అందరరూ భావించారు. రెండేళ్ల క్రితం డీపీఆర్ తయారి బాధ్యతలను ఎల్‌అండ్‌టీ సంస్థకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేశారని గతంలో అధికారులు చెప్పారు.. ఇందులో భాగంగా ఆరు నెలల క్రితం టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. 213 ఎకరాల్లో టూరిజం అభివృద్ధికి రూ.110 కోట్లు ఖర్చవుతుందని అంచనా కూడా వేశారు. ప్రస్తుతం మెఘా సంస్థతో రూ.1,000 కోట్లతో ఒప్పందం కుదరడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మొదటి విడతగా రూ.33 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటి వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
అడ్వెంచర్ టూరిజం స్పాట్‌గా..
సాధారణంగా పర్యాటక కేంద్రాలను రెండు రకాలుగా అభివృద్ధి చేస్తారు. ఒకటి సాధారణ పర్యాటకం.. ఇందులో అడవుల అందాలను వీక్షించడం, ఆలయాల సందర్శన వంటివి ఉంటాయి..రెండోది అడ్వెంచర్ టూరిజం(సాహస పర్యాటకం). ఇందులో యువత ఇష్టపడే సాహస కృత్యాలను డెవలప్ చేస్తారు. ట్రిక్కింగ్, రోప్ వేలు వంటివి ఉంటాయి. అనంతగిరుల్లో ఈ రెండింటినీ అభివృద్ధి చేయాలని ప్లాన్ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఎకో పార్క్, కన్వెన్షన్ హాళ్లు, ట్రెక్కింగ్, రోప్ వేస్, హోటల్స్, ఆలయాల అభివృద్ధి, వ్యూ పాయింట్స్, గార్డెన్లు, డైనింగ్ హాల్స్, పక్షులు, జంతువులను వీక్షించిందేకు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా 213 ఎకరాలను అన్ని హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. రోజుకు 5వేల మంది పర్యాటకులు వచ్చేలా.. వెయ్యి మంది ఇక్కడ బస చేసేందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 500 మంది నుంచి 1000 మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది.
అనేక అనుకూలతలు
అనంతగిరిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉండటంతో పర్యాటకంగా తీర్దిద్దాడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రాంతం హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే గంటలో నగర వాసులు ఇక్కడికి చేరుకోవచ్చు. బెంగళూరు, ముంబై హైవేల నుంచి కూడా గంటలోపు ఇక్కడికి రావచ్చు. రీజనల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే కేవలం 15 నిమిషాల్లో అనంతగిరులకు రావొచ్చు. దట్టమైన అడవులు, ఎత్తయిన కొండలు, రోడ్డు మార్గంలో అందమైన మలుపులు, గుట్టపై చారిత్రాత్మకమైన అనంతపద్మనాభ స్వామి ఆలయం, ట్రెక్కింగ్ స్పాట్‌లు, అనేక రకాల పక్షిజాతులు, జంతు జాతులు ఈ అడవిలో ఉన్నాయి. తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన కాటేజీలు, బుగ్గ రామేశ్వర ఆలయం, కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులు, అందులో బోటింగ్ ఇలా అనేక రకాలు అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అనుకూల అంశాలు ఉన్నాయి.
అనంత పద్మనాభస్వామి ఆలయం
213 ఎకరాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి అనుమతులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రణాళిక
అనంతగిరుల బాధ్యతలు మెఘా సంస్థకు..
రూ.వెయ్యి కోట్లతో ప్రభుత్వంతో ఎంఓయూ
స్వదేశీ దర్శన్ కింద..
కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పేరుతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రెండో విడతలో మన జిల్లాలోని అనంతగిరిని, యాదాద్రి జిల్లాలోని భువనగిరి కొండను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని భావించింది. అనంతగిరి కొండలు, సమీప అటవీ ప్రాంతం.. పరిసర ప్రాంతాల్లోని సర్పన్‌పల్లి, కోట్‌పల్లి ప్రాజెక్టులకు పర్యాటకంగా తీర్చిదిద్దాడానికి ప్రణాళికలు రూపొందించారు.
రెండేళ్లు కావస్తున్నా ముందుకు పడని అడుగు

పట్టాలెక్కని పర్యాటకం