ఇద్దరికి తీవ్రగాయాలు
దోమ: ట్రాక్టర్‌ను బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన దోమ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మోత్కూర్ గ్రామానికి చెందిన సండి సాయికుమార్, సండి ధన్‌రాజ్ స్వగ్రామం నుంచి పరిగి పట్టణానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మైలారం గేట్ సమీపంలోకి రాగానే ఖమ్మంనాచారం నుంచి వస్తున్న ఓ ట్రాక్టర్ గొడుగోనిపల్లి వైపు మళ్లుతుండగా వెనకనుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 వాహనంలో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అటునుంచి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇరువురి పరిస్థితి విషమంగానే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం.
ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
బషీరాబాద్: ఉరేసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. గ్రామంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన నవీన్(28) హైదరాబాద్‌లోని ఓ సెలూన్ షాపులో పనిచేస్తున్నాడు. ఈయన తల్లిదండ్రులు చనిపోవడంతో పినతల్లి అంజిలమ్మతో కలిసి ఉండేవాడు. వారం క్రితం ఇంటికి వచ్చిన యువకుడు మరునాడు ఉదయం గది తలుపులు తెరవలేదు. దీంతో అనుమానం వచ్చి తలుపులు తెరచి చూడగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే బలవన్మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రూప్ –2లో
సత్తాచాటిన అనిల్
దోమ: నిరుపేద కుటుంబం.. తల్లిదండ్రులు చనిపోయారు.. అయినా పట్టుదలతో చదివి గ్రూప్ –2 ఫలితాల్లో 106వ ర్యాంక్ సాధించాడు దోమ మండలం బ్రాహ్మణపల్లి తండాకు చెందిన నేనావత్ అనిల్. ఎస్టీ కేటగిరిలో 4వ ర్యాంక్ పొందాడు. చక్కటి ప్రతిభ కనబరిచిన అనిల్‌ను గ్రామస్తులు అభినందించారు.
చికిత్స పొందుతూ
ఉపాధ్యాయురాలి మృతి
కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు మృతి చెందారు. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు... పట్టణంలో నివాసం ఉంటున్న జ్యోతి(40) స్థానికంగా ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. ఈ నెల 11న మధ్యాహ్నం పని నిమిత్తం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు జాతీయ రహదారిని కాలినడకన దాటే క్రమంలో మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలవ్వడంతో పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందారు. ఈ సంఘటనపై పాఠశాల కరస్పాండెంట్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.