
పాట పాడుతున్న సాయిచంద్ (ఫైల్)
అనంతగిరి: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో జిల్లా ఉద్యమనాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నిన్నటి వరకు సాయి చంద్‌తో జిల్లా అనుబంధం పెనవేసుకొని ఉంది. ‘రాతి బొమ్మల్లోనా కొలువైన శివుడా.. రక్తబంధం విలువ నీకు తెలియదురా’.. అంటూ ఆయన గొంతు నుంచి వచ్చిన ఆ పాట ఇప్పటికీ తెలంగాణ లోకాన్ని భావోద్వేగానికి గురిచేస్తోంది. ఉద్యమంలో గజ్జె కట్టి పాడిన పాటలు ఈ ప్రాంతంలో ఎంతో మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. సాయిచంద్ వికారాబాద్‌లో వచ్చినప్రతిసారి అందరిలో కలియ తిరిగేవారు. ఉద్యమంలో భాగంగా వికారాబాద్ ఎన్‌టీఆర్ చౌరస్తాలో జరిగిన హైదరాబాద్ హమారా కార్యక్రమంలో ఆయన పాల్గొని తన గొంతుకతో ఆకట్టుకున్నారు. దాంతో పాటు తాండూరులో జరిగిన విద్యార్థి రణభేరి, చేవెళ్లలో జరిగిన విద్యార్థి శంఖరావం, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో బ్లాక్ గ్రౌండ్‌లో జరిపిన సమావేశంలో, కౌకుంట్లలో జరిగిన ఉద్యమ కార్యక్రమం తదితర అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని తన పాటలతో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. ఇటీవల సీఎం కేసీఆర్ వికారాబాద్ పర్యటనలో సైతం సాయిచంద్ విచ్చేసి పాటలతో ప్రజలతో మమేకమయ్యారు. వికారాబాద్ ప్రాంతంలో బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్‌తో పాటు పలువురు ఉద్యమ నాయకులతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. ఈ ప్రాంత ప్రజలు, ఉద్యమ కారులు సాయిచంద్‌కు వికారాబాద్ వచ్చిన సందర్భాలను గుర్తుచేసుకుంటున్నారు.
సాయిచంద్ యాదిలో జిల్లా ప్రజలు