
చించల్‌పేట వద్ద రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్ నారాయణరెడ్డి
నవాబుపేట: మండలంలో ఎక్కడా అవెన్యూ ప్లాంటేషన్ కనిపించడం లేదు. హరితహారం ప్రారంభమై ఎన్నేళ్లయింది..? ఎన్ని మొక్కలు నాటారు..? ఎంత డబ్బు ఖర్చు చేశారు..? ఎన్ని మొక్కలు బతికాయి.. ? ఎక్కడా ఒక్క మొక్క కూడా కనిపించడం లేదు.. అసలు మీరేం చేస్తున్నారు..? మీ అందరినీ సస్పెండ్ చేయడానికి ఈ ఒక్క కారణం చాలు’. అని కలెక్టర్ నారాయణరెడ్డి మండిపడ్డారు. పని చేసే వాళ్లే కావాలని.. లేదంటే చర్యలు తప్పవని ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ, కార్యదర్శులను హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృథా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మండల పరిధిలోని చించల్‌పేట, గంగ్యాడ గ్రామాల్లో శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించారు.
బాధితులను ఆదుకుంటాం
చించల్‌పేట వద్ద మూసీ నదిపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణంలో ఇద్దరు రైతులకు సంబంధించిన 15 గుంటల భూమి పోతోందని, బాధితులకు అంతేస్థలాన్ని మరో చోట ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ రవీందర్‌ను ఆదేశించారు. అనంతరం గంగ్యాడ గ్రామం వద్ద నిర్మిస్తున్న చెక్‌డ్యాంను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హెల్త్ సబ్ సెంటర్ల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారం వివరాలపై ఆరా తీశారు. మందులు అందజేస్తున్నారా..? సకాలంలో పరీక్షలు చేస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో వంట పాత్రలు అపరిశుభ్రంగా ఉండటంపై అసహనం వ్యక్తంచేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలో 52 మంది విద్యార్థులకు 18 మంది గైర్హాజరు కావడంపై హెచ్‌ఎం ఉమామహేశ్వర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత మంది రాకుంటే మీరేం చేస్తున్నారని నిలదీశారు.
పరిశుభ్రత కనిపించడం లేదు..
అనంతరం గంగ్యాడ రైతులతో మాట్లాడుతూ..పంటలు బాగున్నాయా..? ఏఏ పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు..? అని అడిగారు. మందు బస్తాలు, మసాలాలు తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని తెలపడంతో బస్సులు వేయి స్తామని తెలిపారు. అనంతరం డంపింగ్ యార్డును పరిశీలించారు. తడిపొడి చెత్తను వేరు చేయడం లేదని కార్యదర్శి రాజ్యలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో ఎక్కడా పరిశుభ్రత కనిపించడం లేదన్నారు. ప్రజలకు చెత్తబుట్టలు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. ప్రకృతి వనం, క్రీడాప్రాంగణం బాగుందన్నారు. అయితే వీటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఖర్చు చేయగా.. కేవలం రూ.80 వేల బిల్లు చేశారని సర్పంచ్ గోవిందమ్మ కలెక్టర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన ఏఈ మల్లేశం, ఏపీఓ జ్యోతిలను పిలిచి అడిగారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు.
10జీపీఏ సాధిస్తే రూ.10 వేలిస్తా..
గంగ్యాడ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ నారాయణరెడ్డి బాగా చదువుకోవాలని సూచించారు. అందరూ 10 జీపీఏ సాధించాలన్నారు. స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు సర్పంచ్ రూ.10 వేల బహుమానం ఇస్తున్నారని హెచ్‌ఎం కలెక్టర్‌కు చెప్పగా.. 10 జీపీఏ సాధించిన వారందరికీ తాను కూడా రూ.10 చొప్పున అందజేస్తానని కలెక్టర్ తెలిపారు. స్కూల్‌కు ప్రహరీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీపీ భవాని, జెట్పీటీసీ జయమ్మ, డీఈ మాధవరెడ్డి, ఎంపీడీఓ సుమిత్రమ్మ, సర్పంచులు శ్రీనివాస్, గోవిందమ్మ, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి
గంగ్యాడ, చించల్‌పేట్‌లో విస్తృత పర్యటన
హరితహారం నిర్వహణపై తీవ్ర ఆగ్రహం
పారిశుద్ధ్య పరిరక్షణ చర్యలపై అసంతృప్తి