కుక్కల్‌ హడల్‌!

- - Sakshi

పంచాయతీలు, మున్సిపాలిటీల్లోశునకాల వీర విహారం

గుంపులుగా దాడి చేస్తున్న వైనం

గాయాల పాలవుతున్న చిన్నారులు, మూగజీవాలు

నియంత్రణ చర్యలకు ప్రజల డిమాండ్‌

పరిగి: కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏవీధిలో చూసినా గుంపులుగా తిరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు చిన్నా, పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా ఎగబడుతున్నాయి. ద్విచక్ర వాహనదారులపై వెళ్తున్న వారిని సైతం విడిచిపెట్టడం లేదు. వీటి సంతతి నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సమస్య తీవ్రరూపం దాలుస్తోందని ప్రజలు చెబుతున్నారు. శునకాల దాడుల్లో గాయాలపాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో వీధి కుక్కలను అరికట్టేందుకు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక చర్యలు తీసుకునే వారు. జంతుప్రేమికుల ఒత్తిడితో ప్రస్తుతం వీటిని ఆపేశారు. సంతానోత్పత్తి నియంత్రణ ఆపరేషన్లు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదు.

ఇటీవల కుక్కల దాడులు

● కుల్కచర్ల మండలం బొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన హేమలత, అనంతరెడ్డి దంపతుల కుమారుడు శివకుమార్‌ ఇంటిముందు ఆడుకుంటుండగా ఓ వీధి కుక్క దాడి చేసింది. దీంతో బాలుడి ముఖంపై పలు చోట్ల గాయాలయ్యాయి.

●తాండూరులోని కర్బలా మైదాన్‌ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలిక అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తుండగా వీధి కుక్కలు దాడి చేసి, గాయపర్చాయి.

●పరిగి పట్టణ కేంద్రంలోని చీటర్స్‌ కాలనీకి చెందిన సన్నీపై వీధి కుక్కలు దాడి చేశాయి. భయాందోళనకు గురైన విద్యార్థి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి, కుక్కలను బెదరగొట్టారు.

● పరిగి మండల పరిధిలోని పలు గ్రామాల్లో లేగదూడలు, మేకలు, గొర్రెలపై దాడులు చేశాయి.

● గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన చౌరస్తాల వద్ద గుంపులుగా ఉంటున్న శునకాలు దారిన నడుచుకుంటూ వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయి. వీరి చేతుల్లో ఏవైనా కవర్లు వుంటే లాక్కుని వెళ్తున్నాయి.

● రాత్రి సమయాల్లో బయటకు వెళ్తున్న వారు మరొకరిని తోడుగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే చేతిలో కర్ర తప్పనిసరి అనేలా మారింది.

కుక్క కాటుతో రేబిస్‌

పిచ్చి కుక్కలు కరిచిన మనుషులు, పశువులకు రేబిస్‌ వ్యాధి సోకే ప్రమాదముంది.

సకాలంలో టీకాలు వేయించుకోకపోతే ప్రాంణాంతకంగా మారుతుంది.

రోబ్డ్‌ వైరస్‌ వల్ల సంభవించే ఈ వ్యాధి బారిన పడితే మృత్యువు నుంచి బయటపడటం కష్టమని వైద్యులు చెబుతున్నారు.

పెంపుడు కుక్కలకు ఏటా యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇప్పించాలి.

కుక్కల ద్వారా చర్మ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముంది.

జిల్లాలో రేబిస్‌ సోకిన పలు పశువులుమృతిచెందాయి.

పిచ్చికుక్కల నోటినుంచి కారే చొంగ గాయాలకు అంటుకున్నా వ్యాధి సోకుతుంది.

ఈ వ్యాధి ఎక్కువగా కుక్కల ద్వారా, తక్కువగా పిల్లులు, జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుందని పశు వైద్యులు చెబుతున్నారు.

పశువుల్లో ఈవ్యాధి సోకితే నాడీ మండలాన్ని ఆశించి పక్షవాతానికి గురవుతాయి. కుక్క కరిచిన తర్వాత రెండు నుంచి నాలుగు వారాల తర్వాత లక్షణాలు బయటపడుతాయి. ఒక్కోసారి కొంత సమయం కూడా పడుతుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో యాంటీ రేబిస్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి.

కుక్కల దాడిలో గాయపడిన వారు 24గంటల లోపు టీకా వేయించుకోవాలి

Read latest Vikarabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top