
ఇటీవల నిర్వహించిన మోడల్ నవోదయ పరీక్షలో పాల్గొన్న విద్యార్థులు
కొడంగల్ రూరల్: జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయం గ్రామీణ నిరుపేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్యను పొందేందుకు చక్కటి అవకాశం. ఏప్రిల్ 29న ఆరో తరగతి ప్రవేశాలకు నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశం లభిస్తే ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విలువలు, సాహసోపేత కృత్యాలు, క్రీడలు, పౌష్టికాహారంతోపాటు సమున్నత శిక్షణ నవోదయ విద్యాలయంలో ఉచితంగా లభిస్తుంది. జిల్లాలో ఉన్న విద్యాలయంలో 80సీట్లు ఉండగా వేల సంఖ్యల్లో విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ పరిధిలోని పాతకొడంగల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇల్లూరి క్రాంతికుమార్ నవోదయ పరీక్షలో సీటు పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా ప్రిపేర్ కావాలి అనే అంశాలపై సూచనందిస్తున్నారు.
గుర్తుంచుకోవాల్సిన వివరాలు..
పరీక్షలు రాసేవారందరూ చిన్నారులే కావడంతో తడబాటు లేకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందస్తుగా ఓసీఆర్ సీటుపై చిన్నారులకు అవగాహన కల్పించాలి. సమాధానాలు గుర్తించడానికి నీలి, నలుపు బాల్‌పెన్ మాత్రమే ఉపయోగించాలి. రఫ్ వర్క్ చేయాల్సి వస్తే బుక్‌లెట్‌లో 16వ పేజీని వినియోగించుకునేలా చిన్నారులకు సూచించాలి. ఒక్కసారి సమాధానం రాసిన తర్వాత మార్చడం, కొట్టివేయడం, దిద్దడం చేయకూడదు. ముందస్తుగా సమాధానం వచ్చిన వాటికి వెంటనే జవాబు రాసే ప్రయత్నం చేయాలి. రాని వాటికి తర్వాత ఆలోచిస్తూ సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి. ప్రతీ 30 నిమిషాలకు ఓ పర్యాయం గంట కొట్టడంతో సమయాన్ని గమనిస్తూ ప్రశ్నలకు సమాధానాలు రాయాలని వివరిస్తున్నారు.
ప్రవేశ పరీక్ష మూడు విభాగాలు..
మేధాశక్తి పరీక్ష 40ప్రశ్నలతో 50మార్కులకు సంబంధించి ఒక గంట సమయం, గణితంలో 20 ప్రశ్నలకు 25మార్కులకు అర గంట సమయం, బాషా నైపుణ్యానికి సంబంధించి 20 ప్రశ్నలకు 25 మార్కులకు అర గంట సమయాన్ని కేటాయించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. 29వ తేదీ శనివారం ఉదయం 11.30గంటల నుంచి 1.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. సమాధానాలు ఐసీఆర్(ఇంటలిజెన్స్ క్యారెక్టర్ రికగ్నిషన్), ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్) షీట్లలో అంకెల రూపంలో గుర్తించాలి.
మేధాశక్తి..
మేధాశక్తి విభాగంలో 50 మార్కులకు సంబంధించి బొమ్మలతో కూడిన ప్రశ్నలుంటాయి. ప్రశ్న కింద నాలుగు సమాధానాలు బొమ్మల రూపంలో ఉంటాయి. సమయస్ఫూర్తితో ఒత్తిడికి గురికాకుండా ఆలోచించి సమాధానాన్ని ఎంచుకోవడంతో అధిక మార్కులు సాధించేందుకు వీలుంటుందని పేర్కొంటున్నారు.
గణితం..
గణిత విభాగంలో 25 మార్కులకు సంబంధించి 5వ తరగతి వరకు అన్ని చాప్టర్లపై చిన్నారులకు అవగాహన పెంచేందుకు కృషిచేయాలి. ఒక్కో చాప్టర్ నుంచి ఒకటి లేదా రెండు ప్రశ్నలిచ్చే అవకాశం ఉంటుంది. గణితంలో అధిక మార్కులు సాధించేలా కష్టపడాలి. భాషా పఠనాశక్తి విభాగంలో 5 పాఠ్యాంశాలు ఇస్తారు. వాటి ఆధారంగా ఇచ్చే ప్రశ్నలకు సమాధాలను నిశితంగా గమనిస్తూ గుర్తించాలి.
29న ప్రవేశ పరీక్ష
విద్యార్థులకు మంచి అవకాశం
తడబాటు లేకుండా లక్ష్యం దిశగా సాగాలి
ఆరో తరగతి ప్రవేశాలకు చక్కని మార్గం
సూచనలందిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు
విద్యార్థులకు అవగాహన కల్పించాలి
నవోదయ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తల్లిదండ్రులు చక్కటి అవగాహన కల్పించాలి. తడబాటు లేకుండా ఉండేందుకు ప్రశ్న పత్రం ఎలా ఉంటుందో, ఎలా మార్క్ చేయాలో, సమయం సద్వినియోగం చేసుకునేలా వివరించాలి. ప్రశ్న పత్రంలో ఇచ్చే అంశాలపై, వాటికి సమాధానాలు రాసే విధానాన్ని విద్యార్థులకు పూర్తిస్థాయిలో తెలియజేయాలి. ప్రణాళికతో ముందుకు వెళ్తే విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
– క్రాంతికుమార్, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, పాతకొడంగల్