సద్దుల బతుకమ్మ: నువ్వులు ముద్దలు, సత్తుపిండి, కొబ్బరి పొడి.. ఇంకా ఎన్నో!

Many Nutritional Values Include Iron In Bathukamma Sathulu - Sakshi

సద్దుల బతుకమ్మ స్పెషల్‌

ఆరోగ్యాన్ని పెంచే ఫలహారం

బతుకమ్మ వేడుకల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రకాలు

శరీరానికి కావాల్సిన పోషకాలు ఫుల్‌ 

సాక్షి, పెద్దపల్లి: బతుకమ్మ మానవ సంబంధాలకే పరిమితం కాకుండా అతివలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆడపడుచుల్లో ఆరోగ్యకాంతులను వెలిగిస్తుంది. ఆటపాటలతో మానసికోల్లాసమే కాదు, బతుకమ్మ ఆడిన తర్వాత సద్ది పేరుతో ఇచ్చిన్నమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం.. అంటూ మహిళలు ఫలహారాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ఫలాహారాలు చేస్తారు. వీటిల్లో అనేక పోషక విలువలున్నాయి... శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను ఫలహారాల రూపంలో బతుకమ్మ అందిస్తోంది.   

బతుకమ్మ సద్దిలో ‘ఐరన్‌’ 
స్త్రీలు, పిల్లల్లో ఐరన్‌ లోపం కనిపిస్తుంది. బతుకమ్మ వేడుకల్లో తయారు చేసుకునే సద్దిలో ఐరన్‌ శాతం అధికంగా ఉంటుంది. సత్తుపిండి, పెసర ముద్దలు, నువ్వులు, కొబ్బరి, పల్లిపొడి లేదా ముద్దలు ఉంటాయి. ఇవన్నీ పండుగ సమయానికి చేతికి వచ్చే చిరుధాన్యాలు కాబట్టి వీటిని తింటే ఆరోగ్యకరమని పెద్దలు చెబుతున్నారు. ఒక్కోరోజు ఒక్కో తరహా పిండి వంటలను తయారు చేస్తుంటారు.
చదవండి: నేడు, రేపు సద్దుల బతుకమ్మ వేడుకలు 

నువ్వుల ముద్దలు 
నువ్వులు ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వీటితో పొడి చేస్తారు. నువ్వుల్లో అమైనోయాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యమైనవి. జింక్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. జింక్‌ మొదడును చురుకుగా ఉండేలా చేస్తుంది. కాల్షియం ఎమకల ధృడత్వాన్ని పెంచుతుంది.  

సత్తు పిండి 
బతుకమ్మ వేడుకల్లో తొలిరోజు ఆకువక్కలు, తులసీదళాలు, దానిమ్మగింజలు, శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు, మొక్కజొన్న గింజల సత్తు పిండిని తీసుకెళ్తారు. సత్తుపిండిలో పీచు అధికంగా, కార్బొహైడ్రేట్స్‌ తక్కువగా ఉంటాయి. పీచు పదార్థాల వల్ల మలబద్దకం రాదు. రెండోరోజు పప్పు బెల్లం, రేగు పండ్లు, మూడో రోజు పూర్ణాలు, నాల్గోరోజు బెల్లం బియ్యం, ఐదో రోజు అట్లు,  ఎనిమిదో రోజు నువ్వులు, బెల్లం కలిపిన వెన్న ముద్దలు, తొ మ్మిదోరోజు బియ్యం పిండి, గోధుమపిండి, బె ల్లంతో మలీద ముద్దలు తయారు చేస్తారు. íఇవి బతుకమ్మకు పెట్టే ప్రత్యేక నైవేద్యాలు 

పెసర ముద్దలు 
పెసర్లను ఉడకబెట్టి అందులో బెల్లం కలిపి ముద్దలుగా తయారు చేస్తారు. ఇది జీర్ణశక్తిని పెంచడంతోపాటు జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తుంది.  

కొబ్బరి పొడి 
కొబ్బరిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మహిళల ఆరోగ్యానికి పొడి చాలా ఉపయోగపడుతుంది.  

పెరుగన్నం, పులిహోర... 
పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలను కలుపుతారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర ప్రసాదంగా వాడుతున్నారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్‌ వరకు పసుపు విరుగుడుగా పని చేస్తుంది. చింతపండు గుజ్జులో విటమిన్‌ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. పంచామృతాల్లో పెరుగు ఒకటి దీనిలో పోషక విలువలు మెండు. దీంతో అన్నం కలిపి కమ్మనైన నైవేద్యాన్ని సమరి్పస్తారు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, రిబోప్లా విటమిన్, విటమిన్‌ బీ6, బీ12, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్లో బాసిల్లై అధికంగా ఉంటుంది.  

పల్లి పిండి 
పల్లి పిండి శరీర ఎదుగుదలకు అత్యంత ప్రాధానమైంది. అధిక ప్రోటీన్లతోపాటు రుచికరంగా ఉండడంతో చాలా మంది ఇష్టంగా తింటారు. దీనికి బెల్లం జోడించడంతో కావల్సిన పోషకాలు లభిస్తాయి. వీటిని ముద్దలుగా సైతం చేస్తారు.  

రోగనిరోధక శక్తి పెరుగుతుంది 
సత్తుపిండితో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. రుచిగా ఉండే సత్తుపిండి పిల్లలకు, మహిళలకు చాలా ప్రొటీన్స్‌ను అందిస్తాయి. ఐరన్, కాల్షియంతో కండరాల పటిష్టత, ఎముకల గట్టితనం, పిల్లల్లో  ఎదుగుదల వంటి అనేక రకాల ఉపయోగాలున్నాయి. షాపుల్లోని స్వీట్స్‌ తినడంకంటే, సాంప్రదాయ పిండివంటలను ప్రతీ ఒక్కరూ తినడం బెటర్‌. బతుకమ్మ ఆరోగ్యాన్ని పెంచే ప్రత్యేకమైన పండుగ.  
– రాజశేఖర్‌రెడ్డి, జనరల్‌ ఫిజీషియన్, గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి  

Read latest TS Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Author:
కె. రామచంద్రమూర్తి 

Read also in:
Back to Top