ఖమ్మం జిల్లా ప్రాచీన నామమేదో తెలుసా?

Do You Know The Ancient Name Of Khammam District - Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మం చారిత్రక నేపథ్యం కలిగిన జిల్లా. ఈ జిల్లాను 1953లో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఈ ప్రాంతం వరంగల్‌ జిల్లాలో భాగంగా ఉంది. ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. అలాగే 1959లో అప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్లను జిల్లాలో కలిపారు. 

ఈ జిల్లా భూబాగం వేర్వేరు రాజవంశాల కాలాల్లో వేర్వేరుగా ఉంది. ఖమ్మం నగరం మధ్యలో ఉన్న స్తంభాద్రి నుంచే మండపాలకు, స్తంభాలకు కావాల్సిన రాళ్లు తరలిస్తూ ఉండేవారు. అందుకే  ఖమ్మంకు స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉంది. చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు నగరంలోని నృసింహాద్రి అని పిలవబడే నారసింహాలయం నుంచి వచ్చినట్లు, కాలక్రమంలో స్తంభ శిఖరిగా.. ఆ పై స్తంభాద్రిగా మారినట్లు చరిత్రకారులు తెలుపుతున్నారు. ఉర్దూ భాషలో కంబ అంటే రాతిస్తంభం అని అందుకే ఖమ్మం అనే పేరు నగరంలోని నల రాతి శిఖరం నుంచి వచ్చినట్లు మరో వాదన ఉంది. 
(చదవండి:  రైతు బతుకులో నిప్పులు పోసిన గ్యాస్‌.. బీరువాలో దాచిన రూ. 6 లక్షలు..)

నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా..
చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన నాయకులు, యోధులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. 1931లో ఖమ్మంలో మొదటి స్వాతంత్య్ర ఉద్యమం జరిగింది. 1945లో ఖమ్మంలో 12వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ సమావేశం నిర్వహించారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునే గాంధీ ఖమ్మం సందర్శన 1946లో జరిగింది. 1946 ఆగస్టు 5న మహాత్మాగాంధీ ఖమ్మం సందర్శించారు. 

పర్యాటక ప్రాంతాలివే..
జిల్లాతోపాటు ఖమ్మం నగరంలో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. నగరంలో నరసింహస్వామి ఆలయం, శ్రీజలాంజనేయ స్వామి ఆలయం, లకారం చెరువు, దానవాయిగూడెం పార్కు, తీర్థాల సంగమేశ్వర స్వామిఆలయం, లకారం పార్క్, ట్యాంక్‌బండ్, నేలకొండపల్లి వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. 

ఖమ్మం కోట చారిత్రక నేపథ్యం..
సుల్తాన్‌ కులీ కుత్బుల్‌ ముల్క్‌ 1531 ఏడాదిలో అప్పటి ఖమ్మం పాలకుడైన సీతాబ్‌ఖాన్‌ (సీతాపతిరాజు)ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దుర్గం కుతుబ్‌షాహి పాలనలో ఉంది. గ్రానైట్‌ రాళ్లతో నిర్మించిన ఈ పటిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 

కోటకు 10 ద్వారాలు ఉన్నాయి. పశ్చిమం వైపున దిగువ కోట ప్రధాన ద్వారం, తూర్పు వైపున రాతి దర్వాజా, కోట చుట్టూ 60 ఫిరంగులను మోహరించే వీలుంది. కోటలోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్‌ ఉన్నాయి. 60 అడుగులు పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్‌టౌలి అనే బావి కూడా ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది. 
(చదవండి: ఆ పంట సాగుచేస్తే రైతు బంధు, రైతు బీమా కట్‌.. కేసీఆర్‌ కీలక ఆదేశాలు)

Read latest TS Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top